Telangana | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పింది. ‘ప్రజలే పరిపాలకులు’ అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోయింది. పంచాయతీ పాలనకు మూలమైన ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో పూర్తి శూన్యత ఏర్పడింది. సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు లేకపోవడంతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం అగమ్యగోచరంగా మారింది. రెవెన్యూ, అభివృద్ధి పనులు స్తంభించాయి. 14 నెలలుగా గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేక స్థానిక సమస్యలు పరిషారంకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చొరవ చూపడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు నిరుడు ఫిబ్రవరి 1న, 539 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాల గడువు జూలై 4న, 28 జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు జూలై 5న ముగిసింది. ములుగు, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ జిల్లా పరిషత్తులతోపాటు ఆ 4 జిల్లాల్లోని మండల పరిషత్ పాలకవర్గాల గడువు ఆగస్టు 5న ముగిసింది. అంటే గ్రామాల్లో గత 14 నెలలుగా సర్పంచ్లు, వార్డు సభ్యులు లేరు. ఇదే విధంగా జెడ్పీలు, మండల పరిషత్ పాలకవర్గాలు కూడా ఏడాది నుంచి ఖాళీగా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు నిలిచిపోయాయి.
ఫలితంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు స్తంభించి ప్రజలకు మౌలిక వసతులు అందడం లేదు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలు పరిషారం కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్పంచ్లు, వా ర్డు సభ్యులు లేకపోవడంతో తమ సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని, అధికారులు కూడా సమస్యలను పట్టించుకోవడం లేదని ఓ గ్రామస్థుడు వాపోయారు.
ఇన్నాళ్లు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న వారి ద్వారానే పాలన జరుగాలన్న ప్రజాస్వామిక హకు నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక మాట కూడా మాట్లాడటంలేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నచూపు చూడటం, నియమాలను తుంగలో తొకడమేనన్న విమర్శలు వక్తమవుతున్నాయి. ప్రజల పాలనకి గౌరవం ఇవ్వాలని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. స్థానిక సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడానికి ముందే కొత్త పాలక వర్గాలను ఎన్నుకోవాలి. ఇందుకోసం గడువుకు 6 నెలల ముందే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి. ఒకవేళ అది సాధ్యం కాకుంటే పాలకవర్గాల గడువు ముగిసిన 6 నెలల్లోగా కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి 14 నెలలు అయినా కొత్త పాలకవర్గాలు ఎన్నిక కాలేదు. నేటికీ కొత్త మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలను నియమించలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందునే స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు జంకుతున్నారని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.