నల్గొండ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకంతో పాటు మౌలిక వసతులు కల్పించిన దృష్ట్యా ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ డిసెంబర్ 31న 950 మంది కొత్త డాక్టర్లను నియమించామని అన్నారు. డాక్టర్లలో 8 మందిని మర్రిగూడలో నియమించామని, డిజిటల్ ఎక్స్‌రే మిషన్, అంబులెన్స్‌ను ప్రారంభించామని వివరించారు. ఇంకా జనరేటర్ ఏర్పాటు, గైనకాలజిస్ట్ నియామకం, స్కానింగ్ మిషన్ మంజూరు చేయబోతున్నామని వెల్లడించారు.కేటరాక్ట్ ఆపరేషన్లు చేసేలా వసతులు కల్పిస్తామన్నారు. ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ. 30 వేల కోట్లు ఆపిందని ఆరోపించారు.
కేంద్రం నిధులు ఆపినా, కరోనా వచ్చినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి కంటి వెలుగులో భాగంగా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వనున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.