యాదగిరిగుట్ట, జూలై 11: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు శనివారం కొలువుదీరింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో స్వయంభూ గర్భాలయ బంగారు దర్వాజ ప్రాంతంలో ఉదయం 11.37గంటలకు ఈవో భవానీ శంకర్, ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డితో ప్రమాణం చే యించారు. బోర్డు సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, కొణిదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ, గుండా మల్లయ్యగుప్తా, స్వాతి కంఠమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ స్వామివారి ఎదుట ప్రమాణంచేసి బాధ్యతలు చేపట్టారు.
ఎక్స్అఫీషియో సభ్యుడు దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంత్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్ జీ కిషన్‌రావు, ఈవో, ఆలయ ప్రధానార్చకు డు కే వేంకటాచార్యులు బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రమాణస్వీకారోత్సవానికి బోర్డు సభ్యుడు తూళ్ల వీరేందర్‌గౌడ్, ఎక్స్అఫీషియో సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరుకాలేదు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవస్థాన డీఈవో దోర్భల భాస్కర్‌శర్మ, ఏఈవోలు రఘు, డీ సురేందర్‌రెడ్డి, జూశెట్టి కృష్ణ పాల్గొన్నారు.
ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా ఎన్నికైన దేవాలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి గైర్హాజరయ్యారు. గతంలో పాలక మండలిలో అనువంశిక ధర్మకర్తను చైర్మన్‌గా నియమించేవారని.. ఇందుకు భిన్నం గా సీఎం రేవంత్‌రెడ్డి పాలకమండలిలో దేవస్థానానికి సంబంధంలేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆయన అ భ్యంతరం వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానంచేసి 2005 చట్టాన్ని ఆమోదించి అనువంశిక ధర్మకర్తను తొలగించే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కొత్త ట్రస్ట్‌బోర్డును సవాల్ చేస్తూ హిందూ ధర్మపరిరక్షణ సమితి, రాష్ట్ర ధర్మకర్త మండలి హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. 1966లో రూపుదిద్దుకున్న దేవాదాయ చట్టానికి ప్రభుత్వం నీళ్లు వదిలి దేవాలయ అనువంశిక ధర్మకర్త వ్యవస్థను పూర్తిగా తొలగించాలనే ఆలోచనలో ఉన్నదని ధ్వజమెత్తారు.