NHRC | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఉదంతంపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. లగచర్లలో ఏం జరిగిందో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలను ఆదేశించింది. తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపించాలని నిర్ణయించింది.
లగచర్లలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. హింసకు గురైన బాధితులలో చాలామంది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడినవర్గాల వారేనని గుర్తించింది. పోలీసుల వేధింపులతో గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి సమీప అడవులు, వ్యవసాయ క్షేత్రాల్లో తాతాలిక ఆశ్రయం తీసుకున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. బాధితులకు ఆహారం, వైద్యసాయం వంటి కనీస సౌకర్యాలు కూడాలేవన్న విషయం కమిషన్ దృష్టికి వచ్చింది.
ఈ నెల 11న అర్ధరాత్రి పోలీసులు, ఇతరులు తమపై సాగించిన దమనకాండపై వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బాధితులలో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారుండగా.. వారిలో 12 మంది బాధితులు కమిషన్ను ఆశ్రయించి తమను రక్షించాలని కోరారు. ప్రతిపాదిత ‘ఫార్మా విలేజ్’ కోసం భూమిని సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలను ఫిర్యాదులో వివరించారు.
వందలాది పోలీసులు, స్థానిక గూండాలు గ్రామంపై దాడి చేసి, ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో మహిళలు, గర్భవతులు గాయపడ్డారని వివరించారు. కరెంట్ తీసేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి తమపై దమనకాండను సాగించిన పోలీసులు తిరిగి తమపైనే తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఇండ్లను వదిలి సమీపంలోని వ్యవసాయ భూముల్లో తాతాలిక ఆశ్రయం పొందారని వివరించారు.
లగచర్ల ఉదంతంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ల స్థితి, కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, భయంతో ఊరు వదలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నవారి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. బాధితులకు, ప్రత్యేకించి మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా? గాయపడిన గ్రామస్థులకు వైద్య సహాయం అందిందా? లేదా? వంటి వివరాలను సైతం తెలియాలని స్పష్టం చేసింది. తక్షణమే దర్యాప్తు అధికారుల బృందాన్ని సంఘటన స్థలానికి పంపుతున్నామని, వారంలో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆ బృందాన్ని ఆదేశించినట్టు తెలిపింది.