హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. భూసేకరణ, పరిహారం, పునరావాసంలో ఎక్కడా నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ముందుకుపోతున్నది. ప్రజలను అయోమయానికి గురిచేస్తూ ప్రాజెక్టు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నది. ప్రజలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ పరీవాహకాన్ని విధ్వంసం చేసేందుకు ముందుకే వెళ్తున్నది. 3,000 ఎకరాల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదట మలక్‌పేటలో మూసీ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తర్వాత లంగర్‌హౌస్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో ప్రారంభిస్తామని హడావుడి చేశారు. వారంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం నుంచి ఆలయ పునరుద్ధరణవైపు మారి ప్రాజెక్టు పనుల శంకుస్థాపనను మంచిరేవులకు మార్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ప్రణాళిక లేకుండా, ఎంత కంగాళీగా వ్యవహరిస్తున్నదో చెప్పేందుకు ఇదే ఉదాహరణ. మొదట 2025 ఫిబ్రవరిలో హడావుడిగా మలక్‌పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు కూలగొట్టారు.
మూసీ పొడవునా పాతబస్తీ నుంచి నాగోల్ దాకా అనేక కాలనీల్లో మార్కింగ్‌లు చేసారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఏడాది పాటు టైంపాస్ చేసి, 2026 ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహంతో రూ. 5,000 కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడుతాం అని చెప్పి మధు పార్క్ రిడ్జ్ వంటి అనేక అపార్ట్మెంట్లు, ఇండ్లు, రైతులకు నోటీసులిచ్చారు. ఇక్కడా దుమారం రేగింది. ‘మా ఇండ్లు, పొలాలు, జాగల జోలికి వస్తే ఊరుకునేది లేదు’ అని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో అంతా తూచ్ అనేసి వారంలోనే ప్రభుత్వం ప్లాన్ మార్చింది.
ఈసారి మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సడన్‌గా ‘మంచిరేవుల వద్ద ఉన్న ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని భారీ స్థాయిలో విస్తరిస్తాం’ అని చెప్తున్నది. ఇందుకు నేడే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రెండు వారాల కిందట ఇచ్చిన మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కూడా ఈ గుడి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అసలు మూసీని శుద్ధి చేసే పని వదిలేసి ఈ విగ్రహాలు, గుడుల పేరు మీద చేస్తున్న హడావుడి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలేంటని మీడియా, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుండగా ‘చిత్తశుద్ధిలేని శివ పూజలేల‘ అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా నేడు మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సబ్‌కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన విధివిధానాలు, నియమ నిబంధనలు ఇప్పటికే ఖరారు చేశారు. ప్రాజెక్టు వ్యయం, చేపట్టే పనులు, భూసేకరణ, పరిహారం సహా ప్రభుత్వం సుందరీకరణలో చేపట్టే నిర్మాణాలను కూడా తేల్చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సమక్షంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి మార్కింగ్ చేపడుతున్నారు.
‘ఓవైపు పనులు ప్రారంభిస్తుంటే ఇప్పుడు సబ్ కమిటీ కొత్తగా ఏం చేస్తుంది? అంతా అయిపోయాక సబ్‌కమిటీ వేయాల్సిన అవసరం ఏమున్నది? అసలు సబ్‌కమిటీ ఇప్పుడు చేయడానికి ఏమున్నది? రోజుకో మాట మారుస్తూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇప్పటిదాకా మూసీ పునరుద్ధరణపై ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ తప్పుదోవ పట్టించి భూములు లాక్కొనేందుకే’ అని మూసీ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అసలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వవిధానమేంటో స్పష్టత లేదని తేల్చిచెప్తున్నారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకోమాట చెప్తూ నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తున్నది. రోజుకో విధానం అమలు చేస్తూ పరీవాహక ప్రజల నుంచి భూములు లాక్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాజెక్టు ప్రకటించగానే డీపీఆర్ రూపొందించకుండానే ఇండ్లు కూల్చేసి బాధిత ప్రజలను నిర్వాసితులను చేశారు. మూసీ పరీవాహకంలో సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి దాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పటిదాకా ఆ సర్వే వివరాలు బయటపెట్టలేదు. రోజుకో నివేదిక పేరిట కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. రివర్ బెడ్, నది వెడల్పు, బఫర్ జోన్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొన్నటిదాకా రూ.1.5 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని, 3,300 ఎకరాలు స్వాధీనం చేసుకొని 10 వేలకు పైగా ఇండ్లు కూలుస్తామని గెజిట్ విడుదల చేశారు.
ఇప్పుడేమో ఫేజ్-1లో రూ.6.500 నుంచి రూ.7వేల కోట్లతో మూసీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. కొత్త అంశాలను చేరుస్తూ బాధిత ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. మూసీ సరోవర్ ప్రాజెక్టులో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తామని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో చెప్పుకొచ్చారు. డీపీఆర్‌ను వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పినా అదీ జరగలేదు. పీపీటీలో ఎక్కడా ప్రజలకిచ్చే పరిహారం గురించి ప్రస్తావించకపోవడంతో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
మూసీ జనాందోళన్, బస్తీ జేఏసీ ప్రతినిధులు సైతం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటిదాకా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ దాకా భూసేకరణ చేసి పనులు చేపడుతామని ప్రకటించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తీసుకొచ్చి ఉగాది రోజున శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. అదీ పక్కకు పెట్టి మాట మార్చి ఇప్పుడు ఉస్మాన్ సాగర్ సమీపంలోని మంచిరేవులలో గుడి పునర్నిర్మాణం పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. ఇలా ప్రాజెక్టులోకి రోజుకో ప్రతిపాదన తెస్తూ ప్రజలు, బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి పరిహారంపై రోజుకోమాట మారుస్తూ ప్రభుత్వ పెద్దలు పరిహాసం చేస్తున్నారు. నియమ నిబంధనలు రూపొందించక ముందే మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు కూల్చి కొంతమందికి కేసీఆర్ హయాంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. బాధిత ప్రజలు లోన్ తీసుకొచ్చి కట్టుకున్న ఇండ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంతో నేటికీ ఈఎంఐలు కడుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఫేజ్-1 పేరిట గాంధీ సరోవర్ నిర్మిస్తామని ప్రకటించి బాపూఘాట్ నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ దాకా భూములు తీసుకుంటామంటున్నారు. నిర్వాసితులకు పరిహారం విషయంలో రోజుకో మాట చెప్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వారికి వారే వచ్చి తమ ఇండ్లు, భూములు అప్పగించేలా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
గాంధీ సరోవర్‌లో భాగంగా గాంధీ విగ్రహం కట్టే సంగమానికి సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను కూల్చేస్తామని ఇచ్చిన నోటిఫికేషన్లో టీడీఆర్ ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వారందరికీ భూమికి భూమి.. ఇల్లుకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎంఆర్డీసీఎల్ చైర్మన్ నిర్వాసితులందరికీ టీడీఆర్ ఇస్తామని తేల్చేశారు. మధు పార్క్ నివాసితులకు ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇస్తామని చెప్తే సరే అని చెప్పి మాట మార్చారని, అసలు ఆ అపార్ట్‌మెంట్‌కు విలువే లేదని తాజాగా అసెంబ్లీలో కొంత మంది జర్నలిస్టులతో మాట్లాడుతూ సెలవిచ్చారు.