చాంద్రాయణగుట్ట, నవంబర్, 2(నమస్తే తెలంగాణ): ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగా, విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదికే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనన్న భయంతో ఆ స్కూల్లో కలకలం రేగింది. టీచర్లు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. తాము అంతసేపూ పాఠాలు విన్న, పరీక్షలు రాసేందుకు కూర్చొని ఉన్న భవనం గోడలను పెద్ద బుల్డోజర్ కూల్చి వేయడాన్ని చూసి భయందోళనకు గురయ్యారు.
ఈ ఘటన శనివారం హైదరాబాద్ నగర పరిధిలో చాంద్రాయణగుట్ట బాబానగర్‌లో ఉన్న ఆర్నా గ్రామర్ స్కూల్లో చోటుచేసుకున్నది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఆ స్కూలు కూల్చివేత చేపట్టిన నిర్వాకమిది. విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే బుల్డోజర్లతో వచ్చిన మున్సిపల్ అధికారులు పాఠశాల ప్రహరీతోపాటు పాఠశాలను కొంత భాగం కూల్చివేశారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరును పాఠశాల యాజమన్యంతో పాటు టీచర్లు, విద్యార్థులు నిరసించారు.
బడిలో పిల్లలున్నారు, పాఠశాల వదిలే సమయం వరకు గడువు ఇవ్వాల్సిందిగా టీచర్లు కోరినా కనికరం లేని ఆ అధికారులు పట్టించుకోలేదు. కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలను చేపట్టడం ఏమిటని ప్రశ్నించిన యాజమన్యం మొరను ఆలకించలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూలివేతలు చేపట్టిన అధికారుల తీరుపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. లక్షలాది రూపాయల ఫర్నిచర్ ధ్వంసమైందని వాపోయింది. మున్సిపల్ ఉన్నతాధికారులెవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, కావాలనే కూల్చివేత చేపట్టారని ఆరోపించింది.
కోర్టుకెళ్లిన పాఠశాల యాజమాన్యం
బాబానగర్ మీదుగా బాలాపూర్ వైపు వెళ్లే రోడ్డు గతంలో 30 అడుగుల మేర ఉండేది. ఈ రోడ్డును 100 ఫీట్ల మేర విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లకు నోటీసులు ఇచ్చి కూల్చివేశారు. ఆర్నా గ్రామర్ హైస్కూల్ నిర్వాహకులు తమకు కొంతగడువు కావాలని, పాఠశాలను కూల్చివేయొద్దని, నష్టపరిహారం కూడా పెంచాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు పాఠశాల భవనాన్ని కూల్చొద్దని కోర్టు స్టే కూడా ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్‌ను ఎత్తివేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులు గత ఏప్రిల్‌లో కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగానే కోర్టు తీర్పు ఇవ్వకున్నా, నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో పాఠశాల యాజమన్యం నివ్వెరపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు.