జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖారారు చేయకముందే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ హస్తం పార్టీలో అసంతృప్తి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కాంగ్రెస్ నేత అనిరుధ్‌రెడ్డి అనుచరగణం రెండు గ్రూపులుగా విడిపోయాయి. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా, టికెట్ దక్కని మరో నేత వర్గం సైలెంట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, కాంగ్రెస్ నేత అనిరుధ్‌రెడ్డి నియోజకవర్గంలో వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. వీరిద్దరు ఎవరికి వారుగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా అనిరుధ్‌రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించటంతో ఆ పార్టీలో అసమ్మతివాదం భగ్గుమన్నది. ఒక్కసారిగా ఎర్ర శేఖర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్చర్ల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత ఎర్ర శేఖర్‌కు ఎందుకు టికెట్ కేటాయించడం లేదని మల్లు రవితో వాగ్వాదానికి దిగారు.
ప్రజాబలం లేని నాయకుడికి టికెట్ కేటాయించి పార్టీకి నష్టం చేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మైనార్టీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ జడ్చర్ల పట్టణ అధ్యక్షుడు మీనాజొద్దీన్ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ప్రశ్నించారు. తాను సైతం జడ్చర్ల బరిలో ఉంటానని చెప్పగా, ఆయన్ను బుజ్జగించడానికి మల్లు రవి తలపట్టుకున్నారు. మైనార్టీ నాయకులు కేవలం పార్టీలో పనిచేసేందుకు మాత్రమే పనికొస్తారా? ఎన్నికల్లో నిలబడేందుకు అర్హత లేదా? అంటూ మైనార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ఎర్ర శేఖర్ అనుచరులు, మరో వైపు మైనార్టీ నాయకులు మల్లు రవితో వాగ్వాదానికి దిగటంతో వారికి సరైన సమాధానం ఇవ్వకుండానే దండం పెడుతూ జారుకున్నాడు. ఎవరికి వారు దారి చూసుకోకతప్పదంటూ పలువురు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా చాలామంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు సమాచారం.