హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ‘ఉన్నది ఒక్కటే రోకలి.. ఊరంతా పెళ్లి’ అన్న నానుడిని పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులు గుర్తుచేస్తున్నాయి. నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యదర్శుల మధ్య ఆ నిధుల అంశం వివాదాలకు దారి తీస్తున్నది. వాటిని ఏ పద్దు కింద ఖర్చు చేయాలో తెలియక కార్యదర్శులే తలలు పట్టుకుంటున్నారు. దీంతో పచ్చని పల్లెల్లో రేవంత్‌రెడ్డి సర్కార్ పైసల చిచ్చు పెట్టినట్టయింది. అధికారంలోకి వచ్చాక రెండేండ్ల వరకూ పంచాయతీలను పట్టించుకోని సర్కార్.. తాజాగా విడుదల చేసిన రూ.277 కోట్ల నిధుల వినియోగంపైనే ఈ వివాదం నెలకొన్నది.
సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత వచ్చిన ఆ నిధులను పెండింగ్ బిల్లుల కింద తమకే ఇవ్వాలంటూ కార్యదర్శులు, మాజీ సర్పంచులు పేచీ పెడుతుండగా, గ్రామాభివృద్ధికి వాడుతామని నూతన సర్పంచులు పట్టుబడుతున్నారు. ఆ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో నిధుల పంపిణీపై పంచాయతీ కార్యదర్శులు, ప్రస్తుత సర్పంచులు, మాజీ సర్పంచుల మధ్య వార్ నడుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలు వైకుంఠధామాలు, పార్కులు, రైతు వేదికలు వంటి పనులు చేపట్టాయి.
ఇందు కు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.500 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. ఈ నిధుల్లో రూ.277 కోట్లను 2022-23లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని 15వ ఆర్థిక సంఘం విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ నిధులను గ్రామాలకు విడుదల చేయకుండా సొంత ఖర్చులకు వాడుకున్నది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామాలకు ఆ రూ.277 కోట్లు విడుదల చేసింది. అవి క్షేత్రస్థాయిలో ఊరటను ఇవ్వకపోగా కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణలోని పంచాయతీలకు రావాల్సిన సుమారు రూ.3,000 కోట్ల నిధులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
మా పెండింగ్ బిల్లులివ్వండి: సర్పంచుల సంఘం జేఏసీ
తొలుత తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ శృతి ఓఝౌకు ఆమె కార్యాలయంలోనే వినతిపత్రం అందజేశారు. ‘రూ.277 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,500 కోట్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు మాజీ సర్పంచులు వడ్డీలకు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక అనేకమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పదవీకాలం ముగిసి రెండేండ్లు అవుతున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా తక్షణమే జీవో విడుదల చేయాలి’ అని జేఏసీ ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.