హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అబద్ధపు హామీలు, కడుపు నింపని ఆర్భాటపు ప్రచారాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల ఉసురు తీస్తున్నది. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా దెబ్బతిని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 161 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేతి నిండా పని, కడుపు నిండా తిండితో కష్టాల్లేని జీవితాన్ని పొందిన ఆటోవాలాలకు కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహంతో కన్నీరే మిగిలింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట ముందూవెనక ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఛిద్రమయ్యాయి.
అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని, రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మోసం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. కాంగ్రెస్ తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం ఆటోడ్రైవర్లను బలిపీఠం ఎక్కించేలా చేసింది. గడిచిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 161 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంటి పెద్ద చనిపోయిన వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
బీఆర్ఎస్ హయాంలో రోజుకు 20-25 ట్రిప్పులు వేసిన తమకు.. ఇంటికెళ్లే సరికి చేతిలో రూ. 2 వేలు ఉండేవని, ఇప్పుడు అన్ని ఖర్చులు కలిపినా రూ.800 దాటడం లేదని నగరంలోని ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు, వడ్డీల భారం, కుటుంబ పోషణ భారమై తమ కుటుంబాలు కూలిపోతున్నాయని కంటతడి పెట్టుకుంటున్నారు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాల పేరిట తమకు ఉపాధి లేకుండా చేస్తున్నదని, ఆటోడ్రైవర్ల దుస్థితికి కాంగ్రెస్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.