కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట. అప్పట్లో నాకు సొంతంగా రెండు ఆటోలు ఉండేవి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు.. రాహుల్ గాంధీని నేను స్వయంగా ఆటోలో తిప్పిన. మా బతుకులు మారుస్తానని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసిన. కానీ, అదేం జరుగలే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్‌తో మా బతుకులు తలకిందులైనయ్. ఉన్న ఆటోలను అమ్ముకున్న. ఇప్పుడు రోజు కూలీ లెక్కన ఆటో నడుపుకొంటున్న. ఆటో నడిపితే తప్ప ఇల్లు గడవని దుస్థితి మాది’
-ఆటో డ్రైవర్ మస్రత్ ఆలీ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రైవర్‌గా మిగిలాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా చితికిపోయిన జూబ్లీహిల్స్‌లోని ఆటో డ్రైవర్ మస్రత్ అలీ గురించే ఇదంతా.. అసలేం జరిగిందం టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ కాలనీలో మస్రత్ అలీ కుటుంబం నివాసముంటున్నది. దాదాపు 25-30 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్న మస్రత్ 15 ఏండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
నిత్యం వచ్చే సంపాదనలో కొంత పొదుపు చేసుకొని ఆటో యజమానిగా మారాలనుకున్నాడు. రోజుకు రూ.2-3వేల వరకు వస్తుండటంతో ఆటో కిరాయి రూ.300 పోను మిగిలిన దానిలో పైసా పైసా కూడబెట్టుకున్నాడు. 2023 ఆగస్టులో ఫైనాన్స్ మీద ఒక ఆటో కొన్నాడు. ఆటో కిరాయి కూడా లేకపోవడంతో పైసలు బాగా మిగులుతున్నాయని ఇంకో ఆటోను కూడా ఫైనాన్స్ మీద కొనుగోలు చేశాడు. ఒక ఆటోను తాను నడుపుతూ.. ఇంకో ఆటోను మరో డ్రైవర్‌ను పెట్టి నడిపించాడు. దీంతో రోజువారీగా రెండు ఆటోల మీద కనీసం రూ.2-3 వేల వరకు మిగిలేదని మస్రత్ అలీ చెప్పాడు.
2023 నాటికి మూడేండ్ల కొడుకు, ఏడాది లోపు కూతురు.. తన సంపాదన పెరగడంతో పిల్లల్ని మంచి వాతావరణంలో ఉంచాలని నెలకు రూ.7 వేల కిరాయి ఇంట్లోకి మారాడు. కు టుంబ ఖర్చు పెరిగినా ఆదాయం కూడా పెరగడంతో ఆ కుటుంబం సంతోషంగానే ఉన్నది. మస్రత్ మాటల్లో చెప్పాలంటే.. రెండేళ్ల కిందటి వరకు ఎప్పుడూ ఇంట్లో కనీసంగా రూ.15 వేల నగదు ఉండేదట!
రెండు ఆటోలు నడుపుకుంటూ హాయిగా ఉన్న మస్రత్ అలీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అది 2023వ సంవత్సరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ రాష్ర్టానికి వచ్చారు. మస్రత్ ఆలీ ఆటోలో విహరించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ బతుకులు మారుస్తాం’ అంటూ రాహుల్ వాగ్దానం చేశారు. రాహుల్ మాటలు నమ్మిన మస్రత్.. పదేండ్లపాటు తండ్రిలా కడుపులో పెట్టుకొని కాపాడుకొన్న కేసీఆర్ పార్టీని కాదని కాంగ్రెస్‌కు ఓటేశాడు. రెండేండ్ల కాలం గిర్రున తిరిగింది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు, రూ.12 వేల సాయాన్ని కాంగ్రెస్ మరిచిపోయింది. పైగా ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండికొట్టేలా ‘మహాలక్ష్మి’ పథకాన్ని తెచ్చింది. ఇంకేముంది. గిరాకీ లేక మస్రత్ ఆదాయం పడిపోయింది. కుటుంబం గడువడమే కష్టమైంది. తన సొంత ఆటోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించారని అప్పుడు గర్వంగా చెప్పుకొన్న మస్రత్.. ఇప్పుడు ఆ అనుభవాన్ని చెప్పుకొని కుమిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత ప్రయాణం పథకం అందరు ఆటో డ్రైవర్ల లెక్కనే మస్రత్ పైనా పెను ప్రభావం చూపింది.
గతంలో ఒక్క ఆటో మీద రోజుకు కనీసంగా రూ.1200 వరకు మిగిలే పరిస్థితి ఉంటే ఇప్పుడు వెయ్యి రూపాయల సవారీ కూడా నడవని దుస్థితి. మస్రత్ మాటల్లో చెప్పాలంటే.. ‘గతంలో ఆటో స్టాండ్ దగ్గర ఆటో ఉంటే మహిళలు, ఇతరులు వచ్చి ఆటో కావాలని అడిగేవారు. రహమత్‌నగర్ నుంచి నాంపల్లి వరకు పోవాలంటే రూ.200, రూ.250 వరకు అడిగేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. స్టాండ్ మీదున్న ఏ ఒక్క ఆటో దగ్గరకు ప్రయాణికులు వచ్చే పరిస్థితి లేదు. మహిళలు ఉచితంగా బస్సుల్లో పోతున్నరు. ఎవరికైనా ఆటో కావాలంటే ర్యాపిడో బుక్ చేసుకుంటున్నరు. ఇక చార్జీల విషయం ర్యాపిడో దయ.. మా ప్రాప్తంగా మారింది.
సవారీ (ట్రిప్పు) ఉన్నా లేకున్నా రోజుకు ర్యాపిడోకు రూ.30 ఇయ్యాలి. ప్రయాణికుడు ఇచ్చే దాం ట్లో కమీషన్ కట్ చేసుకొని డబ్బులిస్తరు. ఇట్ల రోజుకు ఏడెనిమిది ట్రిప్పులు కొట్టినా రూ.1000-1200 కంటే మించడం లేదు. ఇందులో గ్యాస్‌కు రూ.400-500 పోతే ఐదారు వందల కంటే ఎక్కువ మిగుల్తలేవు. నెలకు రూ.10-15 వేలు వస్తే ఇంటి కిరాయి ఇప్పుడు రూ.8 వేలు (ఏటా ఐదు శాతం పెంపు), పిల్లల చదువులకు ఏటా రూ.25 వేలు, పుస్తకాలు, డ్రెస్సులు, రోజువారీ ఖర్చులు.. జేబుల రూ.50 కూడా ఉంటలేవు. జ్వరమొస్తే మందులకు అప్పులు చేస్తున్న’ అని మస్రత్ అలీ కన్నీరుమున్నీరయ్యాడు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో 8 వేలకు పైగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు నివసిస్తున్నా యి. రెహ్మత్‌నగర్, బోరబండ, యూసుఫ్‌గూ డ బస్తీ, వెంకటగిరి, ఎస్పీఆర్ హిల్స్, కార్మిక నగర్ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్ల నివాసాలు ఎ క్కువ. ‘మహాలక్ష్మీ’ స్కీమ్‌తో గిరాకీలు తగ్గాయని, తమ నష్టాల్ని భర్తీ చేయడంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మం డిపడుతున్నారు. తమను పట్టించుకోని కాంగ్రె స్కు జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్తామని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.
సోమవారం తన ఆటో ఎక్కిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మస్ర త్ తన బాధను చెప్పుకొని కుమిలిపోయా డు. తనలాగే వందలాది మంది సొంత ఆ టోలకు కిస్తీలు కట్టలేక దివాలా తీశారని ఆ వేదన వ్యక్తంచేశాడు. ఆర్థిక ఇబ్బందులను తాళలేక ఆటో డ్రైవర్ల బలవన్మరణాలతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశాడు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తమ ఆటో డ్రైవర్లు బుద్ధి చెప్తారని తేల్చి చెప్పాడు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆటోడ్రైవర్ల బా ధలన్నీ తీరుతాయని కేటీఆర్ భరోసా ఇవ్వడంతో మస్రత్ ముఖంపై చిరునవ్వు కనిపించింది.

ఆడోళ్లకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. మంచిదే కావచ్చు. కానీ మాలాంటి ఆటో డ్రైవర్ల బతుకులెట్ల అని ఎందుకు ఆలోచిస్తలేరు? అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తమన్నరు. నమ్మినం.. కానీ మోసపోయినం. మాలాంటి పేదోళ్లకు మంచి చేయాలెగాని ఇట్ల పొట్ట కొడితే ఏమొస్తదని జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెసోళ్లను అడగాలనుకున్నం. మా దగ్గరికైతే ఎవ్వరూ రాలె. ఎవరైనా రోజురోజుకూ సంపాదన పెరగాలనుకుంటరు. కానీ ఇట్ల ఉన్న సంపాదన పోతే నాలాంటి పేదోళ్లు ఎట్ల బతకాలె? నేనొక్కడినే కాదు.. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగండి. ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా సంతోషంగ లేడు.
– ఆటో డ్రైవర్ మస్రత్ అలీ