Rythu Bandhu |హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): రైతులకు మేలు చేయాలన్న బీఆర్ఎస్ కృషి ఫలించింది. రైతులకు కీడు చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి లైన్‌క్లియర్ అయింది. రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అయితే పలు షరతులతో అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఎన్నికలు ఉన్నందున ఈ నెల 29, 30 తేదీల్లో పంపిణీ చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల సంఘం షరతులు పెట్టినప్పటికీ అర్హులైన ప్రతి రైతుకూ రైతుబంధు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎప్పటి మాదిరిగానే తొలుత ఎకరం నుంచి రైతుబంధు పంపిణీ ప్రారంభించనున్నది.
అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం (ఈరోజు) నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, శని, ఆది, సోమవారం బ్యాంకులకు సెలవులున్నాయి. దీంతో మంగళవారం నుంచి రైతుబంధు సాయం పంపిణీ చేయనున్నది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికే రైతుబంధు కింద 11 విడతల్లో రూ.72 వేల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక రికార్డు. రైతుబంధు పథకం ద్వారా ఏటా 65 లక్షలకుపైగా రైతులకు పెట్టుబడి గోస తీరుతున్నది.
ఈసీని ఒప్పించిన బీఆర్ఎస్
రైతుబంధు పంపిణీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. గత నెల 23న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే రైతుబంధు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ రైతుబంధు పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసింది. రైతుబంధుకు అనుమతివ్వాలని కోరుతూ పలుమార్లు ఈసీకి లేఖలు రాసింది.
అయినప్పటికీ ఎన్నికల సంఘం పలు సందేహాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల పంపిణీకి కేంద్రానికి అనుమతిచ్చినందున రైతుబంధు పంపిణీకి తమకూ అనుమతి ఇవ్వాలని కోరింది. రైతులకు పెట్టుబడి సాయం అవసరాన్ని ఈసీకి నివేదించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విజ్ఞప్తులపై స్పందించిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు రైతుబంధు పంపిణీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధుకు లైన్‌క్లియర్ కావడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యాసంగి సాగుకు పెట్టుబడి గోస తీరిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగిలో 70 లక్షల మందికి లబ్ధి
రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్లో కూడా తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి రైతుబంధు పంపిణీ ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. రైతుబంధు ద్వారా యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని వెల్లడించింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని పేర్కొన్నది. ఈ నెల 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయని, 29,30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించలేదని తెలిపింది.