ఢిల్లీ: నిరుడు స్వదేశంలోనే జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర లిఖించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది. అంతర్జాతీయ క్రీడల్లో ఆస్కార్గా భావించే అత్యంత ప్రతిష్టాత్మకమైన లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఈయర్ 2026కు గాను షార్ట్ లిస్ట్ చేసిన జట్లలో టీమ్ఇండియా కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 20న మ్యాడ్రిడ్ (స్పెయిన్)లో జరుగబోయే అవార్డుల ప్రదానోత్సవంలో విజేతను ప్రకటిస్తారు. టీమ్ ఆఫ్ ది ఈయర్ జాబితాలో భారత జట్టు.. ఇంగ్లండ్ మహిళా ఫుట్‌బాల్ టీమ్, యూరోపియన్ రైడర్ కప్ టీమ్, ఒకాహోమా సిటీ థండర్, పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ), మెక్లారెన్ మాస్టర్‌కార్డ్ ఫార్ములా 1 టీమ్‌తో పోటీని ఎదుర్కుంటున్నది. భారత్ నుంచి ఈ అవార్డును గతంలో సచిన్ టెండూల్కర్ ఒకసారి అందుకోగా రిషభ్ పంత్ తన గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆటలోకి రీఎంట్రీ ఇచ్చిన ఏడాది నామినేట్ అయ్యాడు.