Congress | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలను సాధించడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికా రం చేపట్టి ఐదు నెలలు అయినా తిరగకముందే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు గెలుపొందక పోవడానికిగల కారణాలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ర్టాల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడానికిగల కారణాలపై నివేదిక కోరుతూ కమిటీలను ఏర్పాటు చేసినట్టు సమాచారం.
తెలంగాణపై త్రిసభ్య కమిటీ
తెలంగాణలో పేలవమైన ఫలితాలకుగల కారణాలపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో పీజే కురియన్ (కేరళ), రకీబుల్ హసన్ (అస్సాం), పర్గత్‌సింగ్ (పంజాబ్) ఉన్నట్టు సమాచారం. కర్ణాటకపై కమిటీలో మధుసూదన్ మిస్త్రీ, గౌరవ్ గొగోయ్, హిబీ ఈడెన్, మధ్యప్రదేశ్ కమిటీలో పృథ్వీరాజ్ చవాన్, సప్తగిరి ఉల్కా, జగ్నేశ్ మేవానీ, ఛత్తీస్‌గఢ్ కమిటీలో వీరప్ప మొయిలీ, హరీశ్‌చౌదరి, ఒడిశా కమిటీలో అజయ్ మాకెన్, తారిక్ అన్వర్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ కమిటీలో పీఎల్ పుని యా, రజనీ పాటిల్ ఉన్నారని సమాచారం.
12 సీట్లు వస్తాయనుకుంటే 8 సీట్లేనా?
తెలంగాణలో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం లక్ష్యం. కానీ 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. ఫలితాలు వెలువడిన రోజుననే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీతో మాట్లా డి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే తాను హైదరాబాద్ వచ్చి సర్వే నివేదికల్లో కాంగ్రెస్ వెనుకబడిందని హెచ్చరించినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే దీపాదాస్ మున్షీని అధిష్ఠానం నివేదిక కూడా కోరింది.
పీసీసీ నాయకత్వానికి, ఎంపీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన మంత్రులకు మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు జరిగినట్టు ఏఐసీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇంకా తప్పిదం ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? అనే దానిపై సమగ్ర నివేదిక కావాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏఐసీసీ తాజాగా ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాల సమాచారం.