Free Bus For Women | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమల్లోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100శాతానికి పెరిగిందని.. కొన్ని బస్సుల్లో 120 శాతం కూడా ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో రోజుకు 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇందులో 70శాతం మంది మహిళా ప్రయాణికులే కావటం గమనార్హం.
ఈ ఉచిత బస్సు పథకం కింద మహిళలకు జీరో టికెట్ ఇస్తుండగా వాటికి డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. మహిళల జీరో టికెట్‌కు సంబంధించి దాదాపు రూ.2500 కోట్ల నిధులను సంస్థకు రా్రష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో బస్‌పాస్‌ల రాయితీ కోసం రూ.340 కోట్లు విడుదల చేసింది. ఉచిత బస్సు ప్రయాణం టికెట్ల నిధులను ప్రతీ నెల చెల్లిస్తామని పథకం ప్రారంభం రోజున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారని కార్మిక సంఘాల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగకాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)లకు ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, 2022 డిసెంబర్ నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం పేరుకుపోయాయి. 2017లో జరగాల్సిన వేతన సవరణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21 శాతం ఫిట్మెంట్తో దాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపులకు ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు ఐదువందల కుటుంబాలు గ్రాట్యుటీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేండ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లిస్తామని మూడు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నిధులే విడుదల కావటంతో కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.