కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం మూడు ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాక- కొరాట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం ధగద్ధగాయమానంగా వెలిగిపోయిందని కేంద్రం నివేదికతో వెల్లడైంది. మూడోది అదే కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని నవయువత మేధస్సును మథించి స్టార్టప్ రంగంలో జరిపిన ఆవిష్కరణల రికార్డు కూడా వెలుగుచూసింది. పాలన అంటే విజన్, అభివృద్ధి, సంక్షేమం. అది తెలుసు కాబట్టే.. పదేండ్ల పాటు కేసీఆర్ సుస్థిరంగా నడిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఒక్కొక్కటిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. ఇవేకాదు.. భవిష్యత్తులో ఇంకా ఇంకా వస్తుంటాయి. కేసీఆర్ పుణ్యమా అని వచ్చే మూడేండ్లూ కాంగ్రెస్ మంత్రులు రిబ్బన్లు, కత్తెరలు పట్టుకొని పరుగు తీయాల్సిందే! అడ్డం పొడుగు నిందలు వేసిన మేధావులు ముఖం చాటేస్తూ తిరగాల్సిందే!
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామికరంగ విప్లవానికి కేసీఆర్ ఆద్యుడనేది అక్షర సత్యం. వివక్ష పాలన ఫలితంగా దశాబ్దాలపాటు చీకటి గుహలో మగ్గిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తన ఉకు సంకల్పంతో వెలుగుబాట చూపిన వ్యక్తి. విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చేలా చేశారు. లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోని నీతిఆయోగ్ మరోసారి తన నివేదికలో పేర్కొన్నది. పారిశ్రామిక వికాసానికి కేసీఆర్ చేసిన కృషిని, ఆయన దార్శనికత తెలంగాణను దేశంలోనే ఏ విధంగా అగ్రగామిగా నిలిపిందో నివేదికలో వివరించింది. ఏయే పథకాలు, ఏయే నవకల్పనలు ప్రగతిని పరుగులు పెట్టించాయో పొందుపరిచింది.
రూలింగ్ మారింది.. రూల్స్ మారాయి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు అంటే ఒక ప్రహసనం. పెట్టుబడిదారులు ఒక్కో ఫైలును పట్టుకొని ఒకో అధికారి వద్దకు వెళ్లి, నెలలపాటు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అడిగినంత సమర్పించి అనుమతులు పొందాల్సిన పరిస్థితి. శాఖల మధ్య సమన్వయ లోపంతో పారిశ్రామికవేత్తలు అవస్థలు పడేవారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒకే సమాచారాన్ని వివిధ శాఖలకు పదేపదే సమర్పించాల్సి ఉండేది. ఈ ధోరణి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి విఘాతంగా మారింది. కానీ తెలంగాణలో కేసీఆర్ రూలింగ్ వచ్చిన తర్వాత రూల్స్ మారాయి. పాత మార్గంలోనే నడిస్తే కొత్త ఫలితాలు ఎలా వస్తాయని ఆలోచించిన కేసీఆర్.. రూటు మార్చారు. విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
టీఎస్-ఐపాస్‌తో తొలి అడుగు
తెలంగాణ ప్రభుత్వం 2014లో టీఎస్-ఐపాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా పరిశ్రమలకు అనుమతులకు సింగిల్-విండో విధానం అమలైంది. కాలపరిమితి కలిగిన, పారదర్శక అనుమతి వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇది పెట్టుబడిదారులకు ఒక వరమైంది. నిబంధనలు సులభతరం చేయడంతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
పరిశ్రమ తీరునుబట్టి ఒకరోజు నుంచి 30 రోజుల్లోపు అనుమతులు ఇవ్వడం మొదలైంది. మాటిమాటికీ ఫైళ్ళు వెనకి తిప్పి పంపడం లేనేలేదు. ఫైళ్లకు నిర్ణీత కాలంలో అనుమతులు ఇవ్వకపోతే.. ఆ జాప్యానికి కారణం ఏమిటో తెలుసుకునే హకు కూడా పారిశ్రామికవేత్తలకు కల్పించారు.
గడువు మించి అనుమతులు ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. టీఎస్-ఐపాస్ డిజిటల్ వేదికపై 25కు పైగా ప్రభుత్వ శాఖలను ఏకీకృతం చేసింది. కాలుష్య నియంత్రణ, పట్టణాభివృద్ధి, అగ్నిమాపక, విద్యుత్తు తదితర శాఖల మధ్య రియల్ టైమ్ డాటా మార్పిడి సాధ్యం చేసింది. ఒకసారి ప్రతిపాదన ఇకడ అందిస్తే అన్ని శాఖలకు అందించినట్టే. దీంతోపాటు తమ దరఖాస్తు ఏ స్థాయిలో.. ఏ శాఖ వద్ద పరిశీలనలో ఉందన్నది కూడా పారిశ్రామికవేత్తలు తెలుసుకునే విధంగా ఆన్లైన్ ట్రాకింగ్ విధానం తీసుకొచ్చింది. దీనివల్ల పారదర్శకత పెరిగింది. అధికారుల్లో బాధ్యత.. పెట్టుబడిదారుల్లో విశ్వసనీయత కూడా పెరిగింది. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వేలాదిగా పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారు. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు.

Kcr
రూ.2.60 లక్షల కోట్ల పెట్టుబడులు
నీతి ఆయోగ్-2026 నివేదికలో ‘కన్వర్జెన్స్ మోడల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్’ విభాగంలో నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్‌గా.. ఒక కేస్ స్టడీగా టీఎస్-ఐపాస్‌ను ప్రస్తావించింది. అందులో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్-ఐపాస్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.26,791 కోట్ల పెట్టుబడులు రాగా.. 3,191 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులు లభించినట్టు చెప్పింది. ఇది రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సులభతరం చేసిందని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం నాటి నుంచి నేటి వరకు మొత్తం రూ.2,60,060 కోట్ల పెట్టుబడులు సాధించిందని, 22,745 పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అందించిందని వెల్లడించింది. వీటి ఫలితంగా 17.54 లక్షల మందికి ఉపాధి కల్పించడంలో టీఎస్-ఐపాస్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ కారణంగానే కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు తెలంగాణ రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో నిలిచింది. సులభతర వాణిజ్య విధానాలు అమలు చేస్తూ రాష్ట్రం పారిశ్రామికవేత్తలను ఇప్పటికీ ఆకర్షిస్తున్నది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణాకు ప్రవహిస్తున్నాయి. లక్షల్లో ఉద్యోగాల కల్పన జరిగి ఎన్నో కుటుంబాలు చీకట్ల నుంచి వెలుగుల వైపు పయనిస్తున్నాయి.
టీ-ఐడియాతో భారీగా రాయితీలు
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అంత్రప్రెన్యూర్ అడ్వాన్స్ మెంట్ (టీ-ఐడీయా) అనేది కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచే ఒక పథకం. 2014 పారిశ్రామిక విధానంలో భాగంగా దీనిని రూపొందించారు. ఇది కేవలం భారీ పరిశ్రమలకే కాకుండా, స్థానిక యువత స్థాపించే చిన్ని తరహా పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పారిశ్రామికవేత్తలకు వివిధ రూపాల్లో ఆర్థిక వెసులుబాటు కలిగింది. దీనివల్ల వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి వ్యయం, నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గాయి.
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు స్థిర పెట్టుబడిపై 15% సబ్సిడీ (గరిష్టంగా రూ. 20 లక్షలు) లభించింది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేండ్ల పాటు యూనిట్‌కు రూ.1.00 చొప్పున విద్యుత్ రీయింబర్స్మెంట్ లభించింది.
భూమి కొనుగోలు లేదా లీజుపై 100% స్టాంప్ డ్యూటీ, బదిలీ రుసుము రీయింబర్స్మెంట్ చేశారు. ‘పావలా వడ్డీ పథకం’ కింద కొత్త ఎంఎస్ఎంఈలకు 3- 9 శాతం వరకు ఐదేండ్లపాటు వడ్డీ సబ్సిడీ అందించారు. ఈ పథకంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 10% పెట్టుబడి సబ్సిడీ (గరిష్టంగా రూ. 10 లక్షలు) ఇవ్వడం ద్వారా లింగ సమానత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ రాయితీల కారణంగా తెలంగాణలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం 26 లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా, టీఎస్-ఐపాస్ కింద అధికారికంగా నమోదై కార్యకలాపాలు సాగిస్తున్న యూనిట్ల సంఖ్య నిరంతరం పెరుగుతూ వచ్చినట్టు నివేదిక తెలిపింది.
దళిత, గిరిజనుల ఆశలకు వారధిగా టీ-ప్రైడ్
సామాజిక న్యాయంతో కూడిన పారిశ్రామికాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ వర్గాలకు చెందిన వారిని కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా, ఉద్యోగ ప్రదాతలుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. సాధారణ వర్గాల కంటే ఈ వర్గాలకు ప్రభుత్వం మెరుగైన రాయితీలను ప్రకటించింది.
ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 35-45 శాతం వరకు పెట్టుబడి సబ్సిడీ లభించింది. దీని గరిష్ట పరిమితి రూ.75 లక్షల నుండి రూ.కోటి వరకు ఇచ్చారు. వీరికి యూనిట్ కు రూ.1.50 చొప్పున ఐదేండ్ల పాటు విద్యుత్తు రీయింబర్స్మెంట్ ఇచ్చారు.
టీఎస్ఐఐసీ కేటాయించే పారిశ్రామిక ప్లాట్లలో ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు, భూమి ధరలో 33శాతం రాయితీ ఇచ్చారు. చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు 100% నెట్ ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించారు. ఈ పథకం ద్వారా వేలాది మంది దళిత, గిరిజన యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారు. ముఖ్యంగా రవాణా, ఆహార శుద్ధి, చిన్న తరహా తయారీ రంగాల్లో వీరి భాగస్వామ్యం పెరిగింది. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 84.7% మంది ప్రభుత్వ ప్రోత్సాహకాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సామాజికంగా వెనుకబడిన వర్గాలలో నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
నిరుద్యోగుల కోసం బ్యాంకు లింకేజీ పథకాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నాటి ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు అనుసంధాన పథకాలను అమలు చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ పథకాల కింద యూనిట్ ధర ఆధారంగా సబ్సిడీ శాతం మార్చారు. లబ్ధిదారులు ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వారు ఎంచుకున్న యూనిట్ ఆధారంగా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2023లో ఒక హైదరాబాద్ జిల్లాలోనే 1,151 మంది లబ్ధిదారులకు రూ. 2 లక్షల చొప్పున సబ్సిడీని మంజూరు చేసింది. ఈ రకమైన పథకాల ద్వారా తండాలు, మారుమూల గ్రామాల్లో కిరాణా దుకాణాలు, డెయిరీ ఫామ్స్, ఇతర చిన్న తరహా వ్యాపారాల స్థాపనకు ఊతమిచ్చాయి.
వెంచర్ క్యాపిటల్ సంస్థలతో పెట్టుబడులు
తెలంగాణను స్టార్టప్ స్టేట్‌గా మార్చాలనే లక్ష్యంతో నాటి ప్రభుత్వం ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనే నినాదాన్ని తీసుకువచ్చింది. దీని ఫలితంగా ఆవిర్భవించిన టీ-హబ్, వీ-హబ్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్స్గా గుర్తింపు పొందాయి. వారికి ప్రత్యేకంగా రూపొందించిన ‘టీ-ఫండ్’తో ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు మూలధన సమస్యను తీర్చడానికి ప్రభుత్వం టీ-ఫండ్ (తెలంగాణ ఇన్నోవేషన్ ఫండ్)ను ఏర్పాటు చేసింది. ఇతర వెంచర్ క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులు పెట్టించింది. వెరసి తెలంగాణలో వేలల్లో స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. ఏడాదికి వెయ్యి చొప్పున స్టార్టప్‌లు కార్యరూపం దాల్చాయి. టీ-ఫండ్ మద్దతు ఉన్న స్టార్టప్‌లు మొత్తం కలిపి 2 బిలియన్ డాలర్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించగలిగాయి.
‘సువిధ’ అనే కార్యక్రమం ద్వారా సాధారణ స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా సామాజిక సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో 37 స్టార్టప్‌లు విజయవంతంగా ఇంక్యుబేషన్ పూర్తి చేసుకున్నాయి. ఇందులో 13 మహిళా నేతృత్వంలోనివి కాగా, 11 ఎస్సీ/ఎస్టీ వ్యవస్థాపకులవి ఉండటం విశేషం.
ఇలా కేసీఆర్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని వారిని ప్రోత్సహించింది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆర్థికంగా సాయం అందించి, సబ్సిడీల ద్వారా చేయూత అందించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సాయం చేసింది. ఈ కృషిని నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసించింది. తన నివేదికలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఉమ్మడి పాలనలో తెలంగాణది అరిగోస. పడావుపడ్డ ఎవుసం.. కునారిల్లిన పరిశ్రమలు.. కుంచించుకుపోయిన అభివృద్ధి. పల్లెల్లో ఎటుచూసినా దీనావస్థ. కొత్త పరిశ్రమలన్నీ ఆంధ్రా ప్రాంతానికే తరలివెళ్తుంటే.. కుంటుబడిన కరెంటుతో తెలంగాణ పారిశ్రామికం కుమిలిపోయింది. పరిశ్రమలకు అనుమతులంటేనే పెద్ద ప్రహసనంగా మారి పారిశ్రామిక అభివృద్ధి మచ్చుకైనా కనిపించని దుస్థితి. ఆ విద్రోహ కుట్రలను స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన పటాపంచలు చేసింది. తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నిలయంగా మారింది. దార్శనికుడు కేసీఆర్ ఆలోచనలతో పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణ అనన్యసామాన్యమైన పారిశ్రామిక వృద్ధిని సాధించింది. ఈ ఘనకీర్తిని నీతి ఆయోగ్ తాజాగా మరోసారి పొగిడింది. తాజాగా విడుదల చేసిన ‘అచీవింగ్ ఎఫిషియెన్సెస్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టార్ త్రూ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్’ (‘Achieving Efficiencies in MSME Sector Through Convergence of Schemes) నివేదికలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతిని కండ్లకు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్, టీ-ఐడియా, టీ-ప్రైడ్, టీ-ఫండ్ వంటి ఎన్నో సంస్కరణలను ప్రస్తావిస్తూ కీర్తించింది.
సబ్బండ వర్గాలకూ అండగా..
నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలను ప్రశంసించింది. టీ-ఐడియా, టీ-ప్రైడ్, టీ-ఫండ్, బ్యాంకు లింకేజీ స్కీమ్స్, గిరిజిన బిడ్డల కోసం తీసుకొచ్చిన సీఎంఎస్టీఈఐ వంటి పథకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికోసం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమలరాకను ప్రోత్సహించేందుకు.. ఒకదానికొకటి అనుసంధానిస్తూ నాటి ప్రభుత్వం చేసిన కృషిని అభినందించింది.
గిరిజన బిడ్డల కోసం సీఎంఎస్టీఈఐ
గిరిజనులంటే కొండకోనల్లో నివసించేవారనే ముద్రను చెరిపివేసేందుకు, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ సీమ్’ను ప్రవేశపెట్టింది. దీనిని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ట్రైకార్ అమలు చేస్తున్నది. ఇది కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా, అభ్యర్థులకు ప్రపంచ స్థాయి వ్యాపార మెళకువలను నేర్పిస్తున్నది. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. అకడ వారు వ్యాపార ప్రణాళికలు (డీపీఆర్) ఎలా రూపొందించాలి? మారెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. 21-40 ఏండ్లలోపు వారికి రూ.50 లక్షల సబ్సిడీ ఇచ్చి వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించారు. 2020-2022 మధ్య కాలంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 1,181 మంది అభ్యర్థులకు నిధుల మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా గిరిజన యువత ఆగ్రో-ప్రాసెసింగ్, తయారీ, సేవా రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగారు.