జగిత్యాల, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని, అది ప్రజాభీష్టమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పే ర్కొన్నారు. రెండున్నరేండ్లలోనే కాంగ్రెస్ స ర్కార్పై ప్రజా వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావా లి’ అన్న ఆలోచన ప్రజల్లో మొదలైందని చె ప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఒకటే మార్గమ ని స్పష్టంచేశారు.
తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సి ద్ధంగా ఉన్నానని, సోమవారం జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో ప్రయాణం కొత్త అనుభూతిని కలిగిస్తున్నదని పేర్కొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో ఆదివారం సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదవశాత్తు మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా పక్కన పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణకు కరువు వస్తే సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యుడవుతారని తేల్చిచెప్పారు. కేసీఆర్ జగిత్యాల సభ అనగానే, రేవంత్‌రెడ్డి మేడిగడ్డ మరమ్మతులు అంటున్నారని, అదే రోజు మేడిగడ్డకు వెళ్తున్నట్టు ప్రకటించారని ధ్వజమెత్తారు. ‘అయ్యా, రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవడం సంతోషం. మరమ్మతులు చేపట్టు నాయనా’ అని హితవు పలికారు.