హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ): జర్నలిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా, ఒక్క జీవోతో 10 వేల మంది అక్రిడిటేషన్లకు కోత విధించేలా తీసుకువచ్చిన జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్ట్ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, పత్రికాస్వేచ్ఛను గౌరవించి.. ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం ఇచ్చిన జీవో నంబర్ 252లోని నిబంధనలతో జర్నలిస్టు సమాజానికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేండ్లుగా కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా, ఇప్పుడు అడ్డగోలుగా ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కీలకపాత్ర పోషించే జర్నలిస్టుల మధ్య విభజన చేసి, విభేధాలకు తావిచ్చేలా నిబంధనలను జీవోలో పొందుపరిచింది. జర్నలిజానికి రెండు కళ్లలాంటి డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులుగా విభజన చేయడం సరికాదన్నారు. డెస్క్ జర్నలిస్టులను వేరు చేసినట్లుగా మీడియా కార్డుల ప్రతిపాదనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను విభజించి పాలించేలా తీసుకొచ్చిన జీవో 252ను టీయూడబ్ల్యూజేను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో 27న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి టీయూడబ్ల్యూజే (143 సంఘం) పిలుపునిచ్చింది. ఈ మేరకు నాయకులు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, తెంజు ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ అన్ని ప్రధాన మీడియా కార్యాలయాలకు వెళ్లి.. వారి మద్దతు కోరారు. కొత్తగా తెచ్చిన జీవోతో జర్నలిస్టులకు జరిగే నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు కొనసాగించాలని టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నేతలు యార నవీన్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, సోమేశ్, బాపురావు డిమాండ్ చేశారు.
జర్నలిస్టులను విభజించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై పోరుబాట పట్టేందుకు జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీయూడబ్ల్యూజే నిరసనలకు పిలుపునిచ్చింది. డెస్క్ జర్నలిస్ట్స్ ఫోరం ఆప్ తెలంగాణ యూనియన్ను ఏర్పాటయింది. ఇటీవలే కార్యవర్గాన్ని నియమించుకొని ఉద్యమ ప్రణాళిక ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. కలిసివచ్చే రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలతో కలిసి పోరాడాలని నిర్ణయించారు.
డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లను రెండు వర్గాలు చీల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్ట్ కాంత్రికిరణ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల చిన్న పత్రికలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీ జర్నలిస్టులకు మేలు చేసేలా ఉండాలి కానీ, అన్యాయం చేసేలా ఉన్నదని ధ్వజమెత్తారు. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో 10 వేల మంది జర్నలిస్టులకు అన్యా యం జరుగుతుందని ప్రెస్‌అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు తొలగిస్తూ మీడియా పాసులు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు అల్లం నారాయణ టీన్యూస్ చానల్‌తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల 23 వేల జర్నలిస్టుల్లో దాదాపు 10 వేల మంది అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రభుత్వమే జర్నలిస్టుల మధ్య విభజన సృష్టించి చిచ్చు పెడుతున్నదని తెలిపారు. ఈ జీవోను అంగీకరిస్తే భవిష్యత్తులో ఎప్పటికీ అక్రెడిటేష్లను పొందలేని పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు. డెస్క్ జర్నలిస్టులు సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లో ప నిచేసే జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇచ్చారని బీఆర్ఎస్ నేత, సీ నియర్ జర్నలిస్ట్, పల్లె రవికుమార్ గుర్తుచేశారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించారని తెలిపా రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చి ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల పేరిట విభజించి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డా రు. ఈ జీవోను ఉపసంహరించుకుని అ న్ని విభాగాల్లోని జర్నలిస్టులకు అక్రెడిటేష న్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇచ్చారని సీనియర్ జర్నలిస్టు రమేశ్ హ జారే గుర్తుచేశారు. జర్నలిస్టుల ఆకాంక్షలు, వాళ్ల ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన జీవో సగానికంటే తగ్గించే విధంగా ఉందని సీనియర్ జర్నలిస్టు మారుతీ సాగర్ అన్నారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజనరేఖ గీసేలా ఉన్నదని విమర్శించారు. జర్నలిస్టులందరికీ ఒకే రకమైన అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.