ఆదిలాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు రైతుభరోసా సబ్ కమిటీకి సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరై రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మిగతా జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేక దృష్టితో చూడాలని కోరారు.
రైతు భరోసా పథకానికి రేషన్‌కార్డు నిబంధన వద్దని మంత్రివర్గ సభ్యులకు రైతులు సూచించారు. కౌలు చట్టానికి సవరణ చేయాలని తెలిపారు. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసి వారికి సాయం అందించాలని కోరారు. రైతులకు బోనస్ ఇవ్వాలని కోరారు.
మంత్రివర్గ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. రైతుల సలహాలు, సూచనలు క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు తయారు చేస్తామని తెలిపారు. రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అన్నారు. నిజమైన రైతులకు మేలు జరిగేలా సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నాలుగు గోడల మధ్యలో కాకుండా ప్రజలతో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు జీ నగేశ్, వంశీ, ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్, కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
అభిప్రాయ సేకరణలో అధికారులు కాంగ్రెస్ వారికే మాట్లాడే అవకాశం ఇచ్చారని కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశానికి పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.