మర్కూక్, జూన్ 6 : ‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది. నర్సన్నపేటకు చెందిన దివ్యాంగుడైన ఎంబరి భిక్షపతి (42) గ్రామ పరిధిలో తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భిక్షపతికి నాలు గు రోజుల కిందట అధికారులు భూసేకరణకు సంబంధించి నోటీసును అందించారు.
బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి రూ.కోటి ధర పలుకుతుం టే, ప్రభుత్వం పరిహారంగా రూ.8 లక్షలు మాత్రమే ఇస్తామని నోటీసులో పేర్కొన్నది. దీంతో రెండురోజులుగా మనోవేదనతో బాధపడుతూ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు మంగళవారం భిక్షపతి మృతదేహంతో రోడ్డుపై రాస్తారోకో చేశారు.