హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ‘హమ్మయ్యా.. ఈ ఏడాది కరువు త ప్పింది’ అంటూ రైతులు మురిసిపోతున్నారు. ‘ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ కరువు పరిస్థితులు చూస్తున్నాం.. ఎప్పుడు కూడా వర్షం కోసం ఎదురు చూడలేదు.. ఈసారి కరువు తప్పెటట్టు లేదు’.. అంటూ రైతులు ఆవేదన చెందా రు. వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి ఎడతెరపిలేని వర్షాలు రైతులకు ఉపశమనం కలిగించాయి. ఏకధాటి వర్షాలతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రైతులకు కరువు పరిస్థితుల్ని దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఎత్తిపోస్తూ చెరువులు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వర్షాలు లేకపోయినా ఈ నీళ్లతో రైతులు పంటల్ని సాగు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇంతలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అంతంత మాత్రంగానే సాగిన సాగు పనులు.. భారీ వర్షాలతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత వారం వరకు 43 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు.. ప్రస్తుతం 58 లక్షల ఎకరాలకు చేరింది. అంటే కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 15 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డట్లు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. నిరుడు 5 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 36 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ప్రస్తుతం 38 లక్షల ఎకరాలకు చేరింది.