వేములవాడ, జూన్ 7: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులు కోరగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో దేవాదాయశాఖ దేవాలయాల్లో ఉద్యోగుల బదిలీలపై జీవో నంబర్ 38తో కూడిన మెమోను జారీ చేసింది. కాగా మార్గదర్శకాలు, బదిలీల వ్యవహారంపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టులో రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి ఆలయాలను యూనిట్‌గా చేసి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో విడతగా మరోసారి బదిలీలకు తెరలేపగా దేవాదాయశాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్త దేవాలయ ఉద్యోగుల బదిలీలు జరుగనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయనున్నదోనని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మొదటి విడతలో జరిగిన బదిలీల్లో ఉద్యోగ నియామకమైన నాటి నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని మొత్తం ఉద్యోగుల్లో 40శాతం మందిని మాత్రమే బదిలీ చేసింది. ఉద్యోగులను ముందుగా ఆప్షన్లు అడిగినప్పటికీ.. తదుపరి జరిగిన ప్రక్రియలో దేవాదాయశాఖ బదిలీ చేసినా తుది నిర్ణయం అధికారులే తీసుకొని బదిలీ చేశారు. ఈ నెల 21లోపు బదిలీ ప్రక్రియ పూర్తికానుండగా రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రధానంగా బాసర, భద్రాద్రి ఆలయాలకు మాత్రం వెళ్లేందుకు ఉద్యోగులు విముఖత చూపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఉద్యోగులకు 2024 ఆగస్టులో బదిలీలు చేశారు. ఆరు ఆలయాలను యూనిట్‌గా చేసుకొని బదిలీలు జరుపగా వేములవాడ రాజన్న ఆలయం నుంచి 28మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 మంది బదిలీ అయ్యారు. బదిలీ ప్రక్రియ పూర్తయి విధుల్లో చేరిన తర్వాత ఉద్యోగులు తమ మాతృ సంస్థకు వెళ్లేందుకు చేసిన పైరవీలకు అధికారులు పెద్దపీట వేశారు. రాజన్న ఆలయానికి బదిలీపై వచ్చిన ఏఈవో రమేశ్‌బాబు, పర్యవేక్షకులు శ్రీలత, రాజన్‌బాబు, వెంకటప్రసాద్, సంజీవరావును వర్ ఆర్డర్, ఇతర పేర్లతో బదిలీ చేశారు. బాసర ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో లక్ష్మణ్‌రావు వేములవాడకు, కొమురవెల్లిలో పనిచేస్తున్న సురేందర్‌రెడ్డిని యాదగిరిగుట్టకు, బాసరలో విధులు నిర్వర్తిస్తున్న రామారావును భద్రాచలానికి బదిలీ చేశారు.