హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ కేంద్రం ఏర్పాటు కోసం అధికారులు 86.13 ఎకరాల ప్రైవేటు భూములను చదును చేస్తున్నారని పేర్కొంటూ ఆరుగురు వ్యక్తులు వేసిన వ్యాజ్యంపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బీ చంద్రసేన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
డంపింగ్ సెంటర్ ఏర్పాటును స్థానికులతోపాటు దుండిగల్‌లోని వాయుసేన సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లో ఎలాంటి పనులు చేయడం లేదని చెప్పారు. నర్సాపూర్ ప్రధాన రహదారి నుంచి డంపింగ్ సెంటర్ వరకు రోడ్డును నిర్మిస్తున్నామని, అందుకు అటవీ శాఖ అనుమతి ఇవ్వడంతో సర్వే కూడా మొదలైందని, 3 రోజుల్లో ఆ సర్వే పూర్తి చేస్తామని వివరించారు.