హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలకు మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేశారు. 2014 జూన్ 2 నుంచి ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించడం వల్ల నష్టపోయిన ఓసీ, బీసీ ఉద్యోగులకు కూడా సీనియార్టీ మేరకు పదోన్నతులు కల్పించాలని 2018లో వెలువడిన కోర్టు ఆదేశాలను రివ్యూ చేయాలన్న పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున పిటిషనర్లకు ఏవిధమైన ఉత్తర్వులు జారీ చేయవద్దంటూ విద్యుత్తు సంస్థలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడి ఏడేండ్లు అయ్యిందని, ఇప్పటివరకు అమలు కాలేదని, రివ్యూ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు పదోన్నతులు కల్పించరాదని ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 నుంచి ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించడం వల్ల నష్టపోయిన ఓసీ, బీసీ ఉద్యోగులకు కూడా సీనియార్టీ మేరకు పదోన్నతులు కల్పించాలని 2018లో హైకోర్టు ఆయా విద్యుత్తు సంస్థలకు ఉత్తర్వులు జారీచేసింది. అన్ని క్యాటగిరీల ఉద్యోగుల సీనియార్టీని సమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు కూడా ఆయా నిష్పత్తి మేరకు పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తాజాగా పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోడ శివ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల మేరకు తెలంగాణలోని ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు జరిగిన జూన్ 2, 2014 నుంచి ఇచ్చిన పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో సమానంగా సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించకపోవడం వల్ల బీసీ, ఓసీ ఉద్యోగులు నష్టపోతున్నారని చెప్పారు. దీనిపై విద్యుత్తు సంస్థల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఇప్పటికే రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున పిటిషనర్లకు అనుకూలంగా ఏ విధమైన ఉత్తర్వులనూ జారీ చేయవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనల విన్న హైకోర్టు.. ఓసీ, బీసీలకు కూడా పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే ఏడు సంవత్సరాల కాలం అయిపోయిందని గుర్తుచేసింది. ధర్మాసనం 2018లో ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్ మీద కూడా విచారణ పూర్తిచేసి తుది ఉత్తర్వులను వెలువరించే వరకు అన్ని విద్యుత్తు సంస్థల్లోని సిబ్బందికి ఎలాంటి పదోన్నతులు ఇవ్వరాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల పదోన్నతులను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కోడేపాక కుమారస్వామి, వైస్ చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో కన్వీనర్ సీ భానుప్రకాశ్ తదితరులు స్వాగతించారు. యాజమాన్యాలు మొండి వైఖరి ప్రదర్శించకుండా, పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ సచివాలయాల్లో సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని, విద్యుత్తు సంస్థల్లో అమలు చేయకపోవడం అన్యాయమని బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి.