హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారంటూ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్‌రెడ్డి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.2500 కోట్లను ఢిల్లీకి పంపారంటూ గత ఏడాది మార్చి 27న కేటీఆర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్‌కు చెందిన బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
దీనిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది మార్చి 29న నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. మార్చి 27న కేటీఆర్ ఆరోపణలు చేస్తే మూడు రోజులు ఆలస్యంగా ఫిర్యాదు చేశారని హైకోర్టు తప్పుపట్టింది. ఆలస్యానికి కారణాలు కూడా పేరొనలేదని ఆక్షేపించింది. ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తెలిపి కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.