హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత బండి సంజయ్ కుమార్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆగస్టు 12 నుంచి 17 వరకు సంజయ్‌ను కోర్టు కమిషనర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నది.
ఇందుకోసం కోర్టు కమిషనర్‌గా నియమితులైన జిల్లా మాజీ జడ్జి కే శైలజకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున క్రాస్ ఎగ్జామినేషన్‌కు అందుబాటులో ఉండలేనని గత విచారణ సమయంలో బండి చెప్పారు. దీంతో ఆగస్టు 12 నుంచి 17 వరకు సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు అందుబాటులో ఉండాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.