హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్‌ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప్పింది. మీరే నిబంధనలను రూపొందించి వాటిని మీరే ఎలా ఉల్లంఘిస్తారని రాష్ట్ర సరార్ను నిలదీసింది. ఏ చట్టంలోని నిబంధనల మేరకు గడుపు పెంచారో చెప్పాలని ఆదేశించింది. తగిన కారణాలు చెప్పకపోతే మద్యం దుకాణాల ప్రక్రియనే నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్టబద్ధత లేకుండా గడువు పొడిగిస్తే, మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే ఉండాలని నొకి చెప్పింది.
మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైదరాబాద్, సోమాజిగూడకు చెందిన డీ వెంకటేశ్వరరావు సహా అయిదుగురు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్ తుకారాంజీ శుక్రవారం విచారణ జరిపారు. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించడానికి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని, లేనిపక్షంలో ఈ నెల 18వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని మద్యం షాపులు కేటాయించవచ్చని అన్నారు. విచారణను శనివారానికి వాయిదా వేస్తూ.. ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.
తొలుత పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్అవినాశ్ వాదనలు వినిపిస్తూ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ల వినతి మేరకు గడువును 18 నుంచి 23 వరకు పొడిగించడం ఏకపక్షమని చెప్పారు. మద్యం షాపుల నోటిఫికేషన్ గడువు ఈ నెల 18తో ముగిసిందని, అయితే ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా గడువు పొడిగింపునకు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 18వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకంటే 19న ఒకరోజే భారీగా వచ్చాయని తెలిపారు. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాలో 227 మద్యం షాపులకు 2,745 దరఖాస్తులు వస్తే ఆ తర్వాతరోజు 19వ తేదీన ఒకరోజే ఏకంగా 2077 వచ్చాయని చెప్పారు. సంఖ్య పెరగడం వల్ల ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుతోపాటు చెల్లించే డిపాజిట్ రూ.3 లక్షలు వెనకి రావని తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలను మార్పు చేయడానికి వీల్లేదని అన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు, గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తే వచ్చే నష్టమేమిటని పిటిషనర్లను ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది అవినాశ్ వాదిస్తూ.. ప్రభుత్వమే నిబంధనలను విధించి వాటిని ఆదే ఉల్లంఘిస్తే ఎలాగని ప్రశ్నించారు. దరఖాస్తుల స్వీకరణను పిటిషనర్లు నియంత్రించడం లేదని, నిబంధనల మేరకు జరగాలన్నదే తమ వాదన అని చెప్పారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ నెల 18న రాష్ట్రస్థాయి బంద్‌కు పిలుపు ఇవ్వడం వల్ల గడువు పెంచాల్సివచ్చిందని చెప్పారు. బంద్ వల్ల సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, అందుకే గడువు పెంచాల్సి వచ్చిందని వివరించారు.
ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, కోర్టుల జోక్యానికి ఆసారం తకువని తెలిపారు. గడువు పెంపు వల్ల పిటిషనర్లకు పోటీ నామమాత్రంగానే ఉంటుందని అన్నారు. ఎంపిక ప్రక్రియలో మార్పులకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పారు. మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తామని, గడువు పెంపు తర్వాత అందిన దరఖాస్తులపై తీసుకునే నిర్ణయం హైకోర్టు వెలువరించే తీర్పుకు లోబడి ఉంటుందని హామీ ఇచ్చారు. గడువు తరువాత వచ్చిన దరఖాస్తుదారులు దుకాణం పొందినట్లయితే వాటిని రద్దు చేస్తామని చెప్పారు. వాళ్లకు డిపాజిట్ సొమ్మును కూడా తిరిగి చెల్లించేస్తామని చెప్పారు. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణ శనివారానికి వాయిదా పడింది.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం చెల్లదంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీ విచారించారు. గతంలో దివ్యాంగులకు మద్యం షాపుల కేటాయింపుల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిందని న్యాయవాది చెప్పారు. దీనిని 3 నుంచి 5 శాతానికి పెంచిందని, 2001లో దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలతోపాటు గౌడ్ కులస్తులకు కూడా రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. దివ్యాంగులకు రిజర్వేషన్ల అంశం హైకోర్టు తేల్చే వరకు దుకాణాల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.