హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కేటాయింపులు శాసనసభ చేస్తుందని, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్ ) దుబ్బాక నియోజకవర్గానికి కేటాయించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పింది. పిటిషన్‌ను ఆదిలోనే కొట్టేయాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు హైకోర్టును కోరారు. ఎమ్మెల్యే వేసిన రిట్‌పై మంగళవారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు.
ఇతర నియోజకవర్గాలకు ఎస్డీఎఫ్ నిధులు కేటాయించినట్టుగా దుబ్బాకకు కేటాయించలేదంటూ రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని రామచంద్రరావు కోరారు. నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరిగితే కోర్టుకు రాకూడదని, అసెంబ్లీలో అడగాలని చెప్పారు. శాసనసభ తీసుకోవాల్సిన నిర్ణయాలను కోర్టులు తీసుకోవడానికి వీల్లేదని అన్నారు. నిధుల కేటాయింపులు సీఎం, శాసనసభలు చేస్తాయని వివరించారు. పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉదహరించారు. పిటిషన్ విచారణార్హతపై ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ మాధవీదేవి ప్రకటించారు. విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు.