హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): అది 2021 జనవరి మాసం.. టీపీసీసీ అధ్యక్ష పదవి నియామక సందర్భం.. తెలంగాణ నేతలు ఉత్కంఠతతో చూస్తున్న సమయం అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. ఆయనను స్వయంగా సోనియాగాంధీ ఢిల్లీకి పిలిచారు. మాట్లాడారు. ‘పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సిన సమయం. మీరైతేనే కరెక్ట్’ అని సోనియాగాంధీ ఒప్పించారు. ఇక ప్రకటనే తరువాయి. సీనియర్ నేతగా జీవన్‌రెడ్డి పేరు మేడమ్ ఖరారు చేశారని, రేవంత్‌రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారని అప్పటి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాకూర్ అంతర్గతంగా పార్టీ నేతలకు చెప్పేశారు.
ఈలోగా చంద్రబాబు రంగప్రవేశం చేసి చక్రం తిప్పారని పార్టీ వర్గాలు అప్పట్లోనే చర్చించుకున్నాయి. కేరళ రాష్ర్టానికి చెందిన ఏఐసీసీ నేత ద్వారా లాబీయింగ్ చేసి చివరి నిమిషంలో రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడైనట్టు ఆ సమయంలో చర్చ కూడా జరిగింది. జీవన్‌రెడ్డితోపాటు అసలు కాంగ్రెస్ నేతలు రాజకీయ మనుగడలో ఉండటం తనకు ఎప్పటికైనా ముప్పేనన్న ఉద్దేశంతో ముఖ్యనేత అప్పటినుంచే ఒక్కొక్కరికి ఎసరు పెట్టుకుంటా వస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జీవన్‌రెడ్డి పార్టీ మార్పు నేపథ్యంలో నాటి తెరవెనుక పరిణామాలు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
తెలుగుదేశం నుంచి వలస వచ్చిన రేవంత్‌రెడ్డిని చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోట్ చేశారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలు తెలుపుతూ వరుసగా అధిష్ఠానానికి లేఖలు రాశారు. లేఖలు రాసిన వారిలో జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి తదితరులు ఉన్నారని సమాచారం. టీడీపీ నుంచి వలస వచ్చిన రేవంత్‌రెడ్డికి ఎందుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదో వివరిస్తూ అధిష్ఠానానికి జీవన్‌రెడ్డి సంతృప్తికరమైన లేఖలు రాశారని తెలిసింది.
సీనియర్ నేతల ఆగ్రహాన్ని గమనించిన అధిష్ఠానం.. రేవంత్ విషయంలో వెనక్కి తగ్గిందని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. తనకు పీసీసీ పదవిపై అంతగా ఆసక్తి లేదని, ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తే సమర్థంగా నిర్వహిస్తానని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
2024 డిసెంబర్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మళ్లీ కేరళకు చెందిన ఏఐసీసీ నేత సీనియర్లను పక్కకు తప్పించి, సీఎం పదవి రేవంత్‌కు దక్కేలా మార్గం సుగమం చేశారని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. నాడు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పీసీసీ చీఫ్‌గా మరొకరిని నియమించాలని అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. అప్పటికే వరింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి, సీనియర్ నేతగా జీవన్‌రెడ్డి ఢిల్లీలో ఎవరి ప్రయత్నం వారు చేసుకున్నట్టు తెలిసింది.
వీళ్లు ఇద్దరు తనకు ప్రమాదమనుకున్న ముఖ్యనేత.. మళ్లీ కేరళ నేత ద్వారా లాబీయింగ్ చేసి, రెడ్డి సామాజికవర్గం నుంచి ఇప్పటికే తాను సీఎంగా ఉన్నానని, కీలకమైన అధ్యక్ష పదవి కూడా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్ఠానాన్ని భయపెట్టినట్టు సమాచారం. దీంతో అధిష్ఠానం మధుయాష్కీగౌడ్‌ను తెర మీదికి తీసుకొచ్చిందని సమాచారం. అయితే, ముఖ్యనేత హోదాలో లాబీయింగ్ చేసి వేరొక గౌడ్‌కు అధ్యక్ష పదవి ఖరారు చేయించారని కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగ చర్చ జరుగుతున్నది.
అప్పటి నుంచి జీవన్‌రెడ్డిపై కత్తిగట్టిన ముఖ్యనేత.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్‌ను వ్యతిరేకంగా రంగంలోకి దించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్వయంగా సీఎంవో నుంచి జిల్లా యంత్రాంగానికి ఫోన్లు చేసి, జీవన్‌రెడ్డికి ప్రియారిటీ అవసరం లేదని, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలని సూచించారని సమాచారం. అధికారిక కార్యక్రమాల పరంగా ఆయన్ను వీక్ చేసిన అనంతరం.. ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని తెలిసింది.
సీనియర్ నేతలు జీవన్‌రెడ్డికే మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చేసిన సూచనలను ముఖ్యనేత ఏమాత్రం ఖాతరు చేయకుండా వలస కాంగ్రెస్ నేతను బరిలోకి దించారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్‌రెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేసి తన సత్తా చూపించారని, చైర్మన్ పదవి కోసం బుజ్జగించి మళ్లీ ఆయన్ను మోసం చేశారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని సమాచారం.