హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు -మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సౌర విద్యుత్తు(సోలార్) యూనిట్లను ఏర్పాటు చేయనున్నది. 11 జిల్లాల పరిధిలో 1,521 పాఠశాలలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించనుండగా, ఇందుకోసం రూ.32.03 కోట్లు వెచ్చిస్తున్నది. మొత్తంగా 3,072 కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇటీవల టీఎస్రెడ్కో సంస్థ టెండర్లు పూర్తిచేసి ఆయా కంపెనీలకు పనులు అప్పగించింది. 2 కిలోవాట్ల ప్లాంట్‌కు రూ.79,800, 3 కిలోవాట్ల ప్లాంట్‌కు రూ.77,950, 4-10 కిలోవాట్ల ప్లాంట్లకు రూ.77,450 చొప్పున ధరలు ఖరారు చేశారు. వీటితోపాటు నెట్‌మీటరింగ్, సోలార్ ఫెన్సింగ్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కలిపి ఒక్కో బడికి రూ.20 వేల వరకు అదనంగా ఖర్చు చేస్తారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే పాఠశాలల విద్యుత్తు బిల్లుల బాధలు చాలావరకు తొలనున్నాయి.
200 మందికిపైగా విద్యార్థులున్న బడుల్లో..
రాష్ట్రంలో 200 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. తొలివిడతలో పైలట్ ప్రాజెక్టుగా 80 బడుల్లో 161 కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్ల ఏర్పాటుకు సర్వే పూర్తిచేశారు. ఇవి మినహాయించగా, మరో 1,441 బడుల్లో సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతానికి ఆయా స్కూళ్లల్లో సర్వే కొనసాగుతున్నది. ప్లాంట్ల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో ఇటీవల టెండర్లు పూర్తిచేసి సోలార్ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ సంస్థలు 3 మాసాల్లో సోలార్ ప్లాంట్లను బిగించనుండగా, డిస్కంలతో అనుసంధానించి నెట్‌మీటరింగ్ విధానంలో విద్యుత్తు బిల్లును మినహాయిస్తారు.
ఏ పాఠశాలల్లో ఎంత అంటే..
మొత్తం 1,521 పాఠశాలల్లో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 916, ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో 605 బడులున్నాయి. వీటిల్లో 2 కిలోవాట్ యూనిట్లే అధికంగా ఏర్పాటు చేయనున్నారు.
3కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్లను 14 బడుల్లో ఏర్పాటు చేయనున్నారు.
4 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసేవి 2 స్కూళ్లు ఉండగా, ఈ రెండు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. 5 కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్లు ఏర్పాటు చేసే స్కూళ్లు నాలుగు ఉన్నాయి.
విద్యార్థులకు ఎంతో మేలు
ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయడం శుభపరిణామం. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడమే కాకుండాకరెంటు బిల్లులు భారీగా తగ్గుతాయి. వీటి ఏర్పాటుకు శ్రద్ధ తీసుకొన్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే తరహాలో అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.
– బుర్రా అశోక్‌కుమార్‌గౌడ్, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు