హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రైతులకు యాసంగి ధాన్యం బోనస్‌ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇదీ ఇప్పుడు అన్నదాతలను తొలిచేస్తున్న అంశం. ప్రభుత్వానికి రైతులు గత యాసంగి ధాన్యం విక్రయించి 5 నెలలు గడిచినా.. ఇప్పటివరకు నయా పైసా బోనస్ సొమ్ము చెల్లించలేదు. తాజాగా వానకాలం ధాన్యం కొనుగోళ్లను సైతం ప్రారంభించిన సర్కారు.. ప్రస్తుత రైతులకు మాత్రం బోనస్ చెల్లిస్తున్నట్టుగా తెలిసింది. దీంతో యాసంగి ధాన్యం అమ్మిన రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. తాము ఎంతో ఆశపడిన బోనస్ సొమ్మును సర్కార్ ఇక చెల్లించదా? అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా చెల్లింపుల్లో బకాయిలు ఉంటే ముందుగా వాటిని చెల్లించి ఆ తర్వాత కొత్త చెల్లింపులు చేపట్టాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గత బోనస్ చెల్లింపులపై రైతులకు ఎగనామం పెడుతున్న సర్కారు.. కేవలం ఈ వానకాలం చెల్లింపులు చేస్తుండటంపై అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పుడు వానకాలం ధాన్యం అలా మొదలైందో లేదో.. ఇలా బోనస్ చెల్లింపులను సైతం ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు రైతులకు తొలుత వానకాలం బోనస్‌ను సర్కార్ జమచేసింది. ఈ చెల్లింపులు కూడా ఇదే విధంగా కొనసాగుతాయో లేక మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోతాయోనని రైతులే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వానకాలం రైతులతోపాటు యాసంగి రైతులకు కూడా బకాయిలు చెల్లించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలంటూ యాసంగి ధాన్యం అమ్మిన రైతులు సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు.
గత యాసంగి ధాన్యం అమ్మిన రైతులు బోనస్ సొమ్ముపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు వైఖరి కూడా ఇందుకు తగ్గట్టుగానే కనిపిస్తుండటం గమనార్హం. రైతుభరోసా మాదిరిగానే పాత బకాయిలు ఎగ్గొట్టి.. కొత్తవి చెల్లించి రైతులను ఏమార్చే కుట్ర చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలం రైతుభరోసా నగదు పంపిణీని ఎగ్గొట్టిన సర్కారు.. ఆ తర్వాత యాసంగిలో కేవలం 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి మమ అనిపించేసింది. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని కప్పిపుచ్చేలా ఈ వానకాలం రైతు భరోసాను పూర్తిగా పంపిణీ చేసింది. గత వానకాలం, యాసంగి రైతుభరోసా బకాయిలపై మాత్రం సర్కారు నోరువిప్పడమే లేదు. దీంతో రైతులు రెండు సీజన్ల నగదును నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సన్నరకం ధాన్యానికి బోనస్ విషయంలోనూ ఇదే కుట్రకు ప్రభుత్వం తెరతీసినట్టుగా రైతులు భావిస్తున్నారు.
గత యాసంగిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4.09 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,159.64 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. గత ఏప్రిల్, మే నెలల్లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికీ రైతులకు బోనస్ బకాయిలే చెల్లించలేదు. సెప్టెంబర్ నెలాఖరులోగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు గతంలో సివిల్ సప్లయ్ అధికారులే స్వయంగా చెప్పారు. కానీ, ప్రస్తుతం అక్టోబర్ నెల పూర్తవుతున్నా నేటికీ బకాయిల ఊసే ఎత్తడం లేదు.
గత యాసంగి ధాన్యం బోనస్ బకాయిలు, ఈ వానకాలం ధాన్యం చెల్లింపులపై సివిల్ సప్లయ్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పాత బకాయిలు రూ.1,159 కోట్లు, వానకాలం బోనస్ కోసం రూ.2 వేల కోట్లు మొత్తంగా బోనస్ కోసం రూ.3,159 కోట్లు అవసరం అవుతాయని నివేదిక ఇచ్చింది. సాధారణ ధాన్యం కొనుగోలుకే ప్రభుత్వం వద్ద నిధులు లేవని తెలిసింది. మొత్తం 19 వేల కోట్లు అవసరం ఉండగా, రూ.7 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలిసింది. దీంతో బకాయిలు చెల్లించేందుకు సర్కారు ఖజానాలో నిధులే లేవని తేటతెల్లమైంది. ఇతరేతర అవసరాలకు కోట్లాది నిధులు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. రైతులు సంక్షేమంపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.