హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కంటివెలుగులో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే కాదు, అద్దాలు తీసుకొన్న వారి నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొంటున్నది. ఇప్పు డు లబ్ధిదారులను ఏమాత్రం కదిలించినా ‘అద్దాలు మంచిగున్నయ్.. మునుపటితో పోల్చితే కంటిచూపు మెరుగుపడ్డది’ అని ముక్తకంఠంతో స్పష్టంచేస్తున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడత కంటివెలుగు విజయవంతంగా కొనసాగుతున్నది.
సోమవారం నాటికి 60 రోజులు పూర్తిచేసుకొన్నది. 1.20 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 లక్షల మందికి రీడింగ్ అద్దాలు, సుమారు 11.5 లక్షల మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశారు. లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకొని, లోటుపాట్లను సవరించుకొనేందుకు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు అందుకొన్న లబ్ధిదారుల్లో రోజూ కొందరికి ఫోన్లు చేస్తూ, కంటి పరీక్షలు ఎలా జరిగాయి? అద్దాలు ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు చూపు ఎలా ఉన్నది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వంటి వివరాలను తెలుసుకొంటున్నారు. అందరూ కంటి పరీక్షలు మంచిగ చేశారని, రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇచ్చారని చెప్పారు. ప్రిస్కిప్షన్ గ్లాసెస్‌కు 2 నుంచి 4 వారాలు పట్టినట్టు తెలిపారు.