హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది. వేద పాఠశాలలకు వన్ టైమ్ గ్రాంట్‌గా ఇచ్చే రూ. 2 లక్షలను వార్షిక గ్రాంటుగా మార్చింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం 75 ఏండ్లు పైబడిన వేద పండితులకు నెలనెలా రూ.2,500 గౌరవ భృతి ఇస్తున్నారు. తాజా ఉత్తర్వులతో 60 ఏండ్లు నిండినవారికి కూడా గౌరవ భృతి అందనున్నది.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ హర్షం వేద పండితుల గౌరవ భృతి పెంపు, వయో పరిమితి తగ్గింపుతోపాటు వేద పాఠశాలల వన్ టైమ్ గ్రాంట్‌ను వార్షిక గ్రాంటుగా మార్చడంపట్ల తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారితోపాటు పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.