హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కడుతున్నది అతిథి గృహమా? లేక సీఎం క్యాంప్ కార్యాలయమా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఇది ఎంసీఆర్హెచ్ఆర్డీ అతిథి గృహమని చెబుతున్నా ఇక్కడ ఇప్పటికే అనేక క్వార్టర్లు ఉండగా అతిథి గృహమా? క్యాంప్ ఆఫీసా?
కొత్త గెస్ట్‌హౌస్ ఎందుకు కడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక సీఎం క్యాంప్ కార్యాలయం కోసం పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఇక్కడ నిర్మాణం కొనసాగుతుండడంతో దీనిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం వినియోగించే అవకాశముందనే వాదనలు వస్తున్నాయి. గెస్ట్‌హౌస్ కోసమని ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్థుల్లో, పదివేల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉండేలా దీన్ని నిర్మిస్తున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇది దేనికోసమనేదానిపై అధికారుల్లోనూ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఇప్పటికే నగరంలో అనేక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రీన్‌ల్యాండ్, దిల్కుషా, ఇందిరాపార్క్ గెస్ట్‌హౌస్, టూరిజం శాఖకు చెందిన తారామతి బారాదరి, హరిత ప్లాజా, శిల్పారామం తదితర భవనాలను గెస్ట్‌హౌస్‌లుగా వినియోగించుకునే వీలుంది. కొత్తగా కట్టిన సచివాలయంలోనూ దేశ విదేశాల అతిథుల కోసం పైఅంతస్థుల్లో అత్యాధునిక హంగులతో గెస్ట్‌హౌస్‌లు నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని మంత్రుల బంగ్లాలను ప్రభుత్వ సలహాదారులకోసం కేటాయించారు. వీటిని కూడా గెస్ట్‌హౌస్‌లుగా ఉపయోగించుకునే అవకాశముంది. ప్రస్తుత ప్రజాభవన్ కూడా నగరం నడిబొడ్డున ఉండి గెస్ట్‌హౌస్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్నిరకాల అవకాశాలున్నా ప్రత్యేకంగా ఎంసీఆర్హెచ్ఆర్డీలో గెస్ట్‌హౌస్ నిర్మాణం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు పలు భవనాలను పరిశీలించారు. పైగా ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బేగంపేట మెట్రో రైల్ భవన్, నానక్‌రామ్‌గూడ గ్రోత్ కారిడార్, ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాలు ముఖ్యమైనవి. అన్నీ చూసిన తర్వాత ఎంసీఆర్హెచ్ఆర్డీలో గెస్ట్‌హౌస్ నిర్మాణం ప్రారంభించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రాంతంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉంటున్నందున అక్కడ గెస్ట్‌హౌస్ కట్టి దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించుకునే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.