Secretariat | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయ భవన నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనంలో కొనసాగుతున్న మరమ్మతులు, వైరింగ్, ఇతర అంతర్గత పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి కారణంగానే తాజాగా భవనం ఐదో అంతస్తు నుంచి పెచ్చులూడి కింద పడ్డాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి సచివాలయం నిర్వహణ బాధ్యతను నిర్మాణ సంస్థ పర్యవేక్షిస్తున్నది. ప్రతి మూడునాలుగు నెలలకు ఒకసారి భవనాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించి, ఎక్కడైనా చిన్నచిన్న మరమ్మతులు ఉంటే చేస్తుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించలేదని సమాచారం. దీంతో కొన్నాళ్లుగా నిర్వహణ సంస్థ చేతులెత్తేసినట్టు చెప్పుకొంటున్నారు.
మరోవైపు సచివాలయ భవనంలో ఎలాంటి మరమ్మతులు, అంతర్గత పనులు చేపట్టినా నిర్మాణ సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈవెంట్లకు డెకరేషన్, లైటింగ్ వంటి పనుల కోసం డ్రిల్లింగ్, వైరింగ్ పనులు చేశారని, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థకు చెప్పలేదని తెలుస్తున్నది. ఇటీవల జరిగిన కొన్ని పనులకు సంబంధించి ఎక్కడెక్కడ డ్రిల్లింగ్, వైరింగ్ చేశారో ఆర్అండ్బీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈ క్రమంలోనే ఐదో అంతస్తులో డ్రిల్లింగ్ చేస్తుండగా పెచ్చులూడి కింద పడ్డట్టు చెప్తున్నారు. ఈ ఘటనపై నిర్మాణ సంస్థ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.