CM Revanth Reddy | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకించడమే కాకుండా తమ స్టాండ్ ఇప్పటికీ మార్చుకోని సీపీఎంను, రాష్ట్ర విభజన వద్దంటే వద్దన్న ఎంఐఎం పార్టీని సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ర్టాన్ని సాధించిన పార్టీగానే కాకుండా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన బీజేపీకి కూడా ఆహ్వానం అందలేదు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ దశాబ్ది వేడుకల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన ప్రభుత్వం సచివాలయంలో అధికారికంగా నిర్వహించిన సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఆహ్వానించకపోవడం ఎన్నికల కమిషన్ ఇచ్చిన అనుమతిని దుర్వినియోగపరచడమే అవుతుందన్న విమర్శలు వినిపించాయి. శాసనసభలో అసలు ప్రాతినిధ్యం కూడా లేని, తెలంగాణ వ్యతిరేక సీపీఎంను ఎలా ఆహ్వానిస్తారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయం వేదికగా అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంగా మార్చడంపై తెలంగాణవాదులు, ఉద్యమకారులు మండిపడుతున్నారు.
సచివాలయాన్ని గాంధీభవన్గా మార్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఏ హోదాలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారని నిలదీస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా శాసనసభలో ప్రాతినిధ్యం లేని సీపీఎం అభిప్రాయానికి ఎలా విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర కొత్త లోగో ఏ ధర్మాన్నీ లేదా చరిత్రను ప్రతిబింబించడం లేదు. తెలంగాణ ప్రాంతంపై ప్రధానంగా ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు, గోల్కొండను ఏలిన కుతుబ్షాహీ పాలకుల ప్రభావం ఉన్నది. పాత లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణం గుర్తులు మన చరిత్రకు, పూర్వాపరాలకు అద్దం పట్టాయి. ఈ గుర్తులే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కానీ కొత్త లోగో ఎటూకాకుండా ఉన్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వం కొత్త లోగోను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– మోహన్ గురుస్వామి, రచయిత