మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 23 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే ఎక్కడికక్కడ నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. పాలమూరులో తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారని, ఒక్క ఆరోపణ కూడా నేటికీ నిరూపించలేకపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టిసారించకుండా కేవలం విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. పార్టీ కోసం పని చేసే వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నా ఫలితం లేకుండా పోయిందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆరు నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి రైతుల పొలాలకు నీరు అందిస్తామని చెప్పి.. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా పనుల్లో పురోగతి లేదని ఆరోపించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, మరో పది శాతం పనులు పూర్తిచేస్తే జిల్లాకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.