మహబూబ్‌నగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో అంతా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నది. ప్రొటోకాల్‌కు మంగళం పాడుతూ అన్నీ తానై అన్నట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం అతనికే వంతపాడుతున్నారు. అధికార బలంతో వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలనను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఒక సర్పంచ్‌గా కూడా గెలవని వ్యక్తితో అధికారిక కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు సమంజసమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం ముఖ్యమంత్రి సోదరుడు అన్న ఒకే ఒక కారణంతో నియోజకవర్గంలోని మెజారిటీ అధికారులు ఎర్రతివాచీ వేసి స్వాగతం పలుకుతుండటం గమనార్హం.
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్‌లో శనివారం నూతన మున్సిపాలిటీ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవనానికి కూడా ‘కడా’ అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి తిరుపతిరెడ్డి భూమి పూజచేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
నారాయణపేట జిల్లా కోస్గిలో రూ.305 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కూడా తిరుపతిరెడ్డి అన్నీ తానై చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం తిరుపతిరెడ్డి పర్యటనలో భాగంగా కోస్గి శివాజీ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు భద్రత పేరుతో సామాన్య ప్రజల వాహనాలను అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ‘కడా’ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి సైతం ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి అధికారే ప్రొటోకాల్ పట్టించుకోకపోతే ఇక మండల స్థాయి అధికారుల ఎలా అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.