భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి.. నాలుగెకరాల్లో మిర్చి సాగు ప్రారంభించాడు.. ఆరుగాలం శ్రమించాడు.. కానీ కాలం కలిసి రాలేదు.. పంటను చీడపీడలు ఆశించాయి.. కొంత పంట సాగునీరు అందక ఎండిపోయింది. చేతికొచ్చిన దిగుబడితో ఆర్థికపరమైన కష్టాలు తీరక, కుటుంబ పోషణ భారం కావడంతో గత్యంతరం లేని పరిస్థితిలో బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన శనివారం భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాకు చెందిన రైతు ఆంగోత్ ఆమ్రు (52). ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలే పేదరికం. ఆపై కుటుంబ పెద్ద మరణం. ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుటుం బం రోడ్డున పడింది. ‘మాకింక దిక్కెవరు? మా కష్టాలు ఎవరు తీరుస్తారు?’ అంటూ ఆదివారం ఆమ్రు కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న వారిని సైతం కన్నీరు పెట్టించింది.
సేవ్యాతండాకు చెందిన ఎన్నో కుటుంబాలు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇదే కోవలో ఆమ్రు కుటుంబం కూడా గతంలో బతుకు దెరువును వెతుక్కుం టూ హైదరాబాద్ వెళ్లింది. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వవైభవం రావడం, స్థానికంగా పని దొరుకుతుండటంతో ఆ కుటుంబం తిరిగి స్వగ్రామానికి వచ్చింది. నిరుడు కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చిన తర్వాత ఆమ్రు కుటుంబం ఎంతో సంతోషించింది. దర్జాగా ఇక సాగు చేసుకోవచ్చని భావించింది. ఆమ్రు తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని ఈ సీజన్లో మిర్చి సాగు చేశాడు. కొంతకాలం తర్వాత పంటను చీడపీడలు ఆశించాయి. ఉన్నట్టుండి బోర్లు ఎండిపోయాయి. పంటను కాపాడుకోవడానికి రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. పంట అంతో ఇంతో చేతికొచ్చింది. ఇటీవల మొదటిసారి తీత పంటను తీశాడు. దిగుబడిలో తాలు మిర్చినే ఎక్కువగా ఉన్నది. ఇదో సమస్య అయితే.. మరో వైపు ఆమ్రు కుమారుడు వీరన్న కొన్నేండ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి భార్యా ఇద్దరు పిల్లలు. రక్త కణాలు పడిపోయి వీరన్న ఇటీవల చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. కుమారుడిని కాపాడుకునేందుకు ఆమ్రు మళ్లీ కొంత అప్పు చేయాల్సి వచ్చింది. ఇక అప్పులు తీరవని నిర్ణయించుకుని రైతు ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మా కుటుంబం వ్యవసాయం మీదే బతుకుతుంది. పోడు చేసుకుంటేనే కడుపు నిండుతాది. ఏడాదిలో బోర్లన్నీ ఎండిపోయినయి. వానకాలంలోనే పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి. మరోవైపు మిర్చి పంటకు తెగుళ్లు పట్టాయి. తోట చేతికి రాలేదు. నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చూడడానికి ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఒక్క అధికారి రాలేదు. మమ్మ ల్ని ఎవరు పట్టించుకుంటరు. మాక్కు దిక్కెవరు?.