హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ముందుగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లను నియమించింది. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం ఉన్న జిల్లా కలెక్టర్‌ను ఆర్వోగా నియమించింది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)ను ఆర్వోగా నియమించారు. అయితే ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ నాన్ ఐఏఎస్ క్యాటగిరీకి చెందిన వారు కావడంతో ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించాలని ఎన్నికల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మరోవైపు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేవారికి శిక్షణలు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణలు పూర్తి చేసిన అధికారులు జిల్లా స్థాయిలో చేపట్టారు.
ఈవీఎంల అవసరతపై సంక్రాంతి తరువాత ఒక అంచనాకు వస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే వారు కోర్టు కేసులు (ఎలక్షన్ పిటిషన్-ఈపీ) వేయడానికి 45 రోజుల వరకు సమయం ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చినందున జనవరి 18 వరకు కేసులు వేసే గడువు ఉంది.
ఓట్ల లెక్క, ఈవీఎంలపై కేసులు వేసిన నియోజకవర్గాలను మినహయించి మిగిలిన సెగ్మెంట్లలోని ఈవీఎంలను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందినే మరోసారి వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలకు పోలీసు బలగాలు తక్కువగానే అవసరం పడతాయని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఫిబ్రవరిలో రాష్ర్టానికి రానున్నారు. ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు.