హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు వారి నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చని పేర్కొన్నది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు కేవలం తమకు ఓటు హక్కు ఉన్న మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించింది. అయితే గతంలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండేది.
ప్రస్తుతం ఈ విధానాన్ని మార్చింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సుమారు 28 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అయితే, ప్రస్తుత నిబంధన ప్రకారం ఎక్స్అఫీషియో ఓట్లను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నదనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్నది.