హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): బడులు ప్రారంభమయ్యే తొలిరోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇస్తామన్న విద్యాశాఖ మాటలు నీటిమూటలయ్యాయి. బడులు ప్రారంభమై వారం గడిచినా పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందనేలేదు. అరకొర, అసమగ్రంగా పుస్తకాలను అందజేశారు. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాల లక్ష్యం నెరవేరడం లేదు. పాఠ్యపుస్తకాలు జిలా కేంద్రాలకు చేరినా, అక్కడి నుంచి బడులకు చేరవేయడంలో తీరని నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకున్నాయి. చాలా జిల్లాల్లో కొన్ని పుస్తకాలిచ్చి, మిగతా పుస్తకాలను ఇవ్వనేలేదు. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం 1.32 కోట్ల పుస్తకాలకు గాను 91.45 లక్షల పుస్తకాలు మండలాలకు చేరినట్టు తెలిసింది. వీటిలో పూర్తిస్థాయిలో పుస్తకాలు బడులకు చేరలేదని తెలిసింది. దీంతో బడులు ప్రారంభమైనా చదువులు ముందుకు సాగడంలేదు.
విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు ఇంకా జిల్లాలకు చేరలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ దృష్టికి తీసుకెళ్లాయి. కొన్ని పుస్తకాల టైటిళ్లు జిల్లాలకే చేరలేదని ఆయా పుస్తకాలను వెంటనే జిల్లాలకు చేర్చాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్రెడ్డి, జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణుడు వినతిపత్రాన్ని సమర్పించారు.
విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను నూరుశాతం జిల్లాలకు చేర్చాం. పుస్తకాల సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. నివేదికలు తెప్పించుకుంటున్నాం. జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకాలను పాఠశాలలకు చేర్చే బాధ్యతను డీఈవోలు చూస్తున్నారు. ఎక్కడైనా అందకపోతే ఒకట్రెండు రోజుల్లో చేర్చేందుకు చొరవ తీసుకుంటాం.
– రమణకుమార్, ముద్రణా సంస్థ డైరెక్టర్