హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప్రతి ఏడాది బడ్జెట్ అంచనాలు పెరుగుతున్నా, వాస్తవ రూపంలో ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతున్నది. అప్పుల భారం మాత్రం గుట్టలా పెరిగిపోతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన నవంబర్ నెల రాష్ట్ర ఆదాయ, వ్యయాల నివేదికను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం, వాటిని పూడ్చడానికి అప్పులపై ఆధారపడటం ఈ నివేదికలో ప్రధానంగా కనిపిస్తున్నది. ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్ల వరకు అప్పులు చేయవచ్చని బడ్జెట్లో అంచనా వేసుకున్నారు. కానీ నవంబర్ నాటికే రూ.58,068.90 కోట్ల అప్పు చేశారు. కేవలం (ఏప్రిల్-నవంబర్) తొలి 8నెలల్లోనే బడ్జెట్ అంచనా కంటే 107.52%అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి అద్దం పడుతున్నది.
అదుపు లేకుండా అప్పులు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. సొంత రాబడులను పెంచుకోవడంలో మాత్రం చతికిల పడుతున్నది. 2022-23లో నవంబర్ నాటికి బడ్జెట్ అంచనాలో 49.7% అప్పులు చేశారు. 2024-25కు ఇది76.84 శాతానికి చేరింది. 2025-26 (ప్రస్తుత ఏడాది) నవంబర్ ముగిసే సమయానికే ప్రభుత్వం 107.52% అప్పులు చేసింది. అంటే, ఏడాది మొత్తానికి అనుకున్న అప్పును ఎనిమిది నెలల్లోనే దాటేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్థాయికి సంకేతంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ నుంచి తీసుకున్న అప్పుల వివరాలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించలేదు. ఇది రాష్ట్ర అసలు అప్పుల లెకలపై అనుమానాలను కలిగిస్తున్నది.
