హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024-25 సంవత్సరంలో కేవలం 14,304 చెరువుల్లోనే చేపపిల్లలను వదిలారు. వాస్తవానికి 2024-25 సీజన్లో రూ.90 కోట్ల వ్య యంతో 80 కోట్ల చేపపిల్లలను వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది కాగితాలకే పరిమితమైంది. వ్యయం రూ.90 కోట్ల నుంచి రూ.34 కోట్లకు, వదలాల్సిన చేపపిల్లల సంఖ్య 80 కోట్ల నుంచి 29 కోట్లకు తగ్గిపోయాయి.
2016-17 సంవత్సరంలో మొత్తం 27 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశారు. ఆ తర్వాత 2024-25 సీజన్లోనే అత్యల్పంగా పంపిణీ చేశారు. అదికూడా చాలా ఆలస్యమైంది. జూన్‌లో ప్రారంభం కావాల్సిన చేపపిల్లల పంపిణీ సెప్టెంబర్ మూడో వారంలో మొదలైంది. ప్రభుత్వం గత బకాయిలను ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్లు సకాలంలో టెండర్లు వేయకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. కాగా, 2025-26 వార్షిక సీజన్‌కు సంబంధించి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు కసరత్తు ప్రారంభించలేదు. వాస్తవానికి ఏటా మే నెలలో టెండర్లు పూర్తిచేసి ఆగస్టులోగా జలాశయాల్లో చేపపిల్లలను వదలాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో ఏటా 270 నుంచి 300 కోట్ల చేపపిల్లలు వదలాలి. కానీ, నిధుల కొరతతో ఆ సంఖ్యను 100 కోట్లకు కుదించారు. ఆ చేపపిల్లలను కూడా పూర్తిస్థాయిలో వదల్లేదు. ప్రభుత్వ లక్ష్యంలో సగం కూడా పూర్తికాలేదు. గత 9 సీజన్లలో ఒక్కసారి కూడా చేపపిల్లల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఇది రాష్ట్ర మత్స్యశాఖ వైఫల్యమే.
– పిట్టల రవీందర్, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఈ ఏడాది ముందుగానే టెండర్లు పిలవాలి. గతంలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలుంటే ముందుగానే చెల్లించాలి. చేపపిల్లలు వదలడంలో ఎలాంటి అక్రమాలు జరిగినా కాంట్రాక్టర్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించాలి. నీటివనరుల్లో వదిలే చేపపిల్లల్లో ఎలాంటి కల్తీ జరగకుండా, లెక్కల్లో తేడా లేకుండా చూడాలి.
– సుదర్శన్, తెలంగాణ గంగపుత్ర జేఏసీ చైర్మన్