ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 6: ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన కుక్కర్ల పంపిణీ రసాభాసగా మారింది. కుక్కర్లు తీసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలిరాగా, గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయగా, కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు.
పోలీసులు రాకపోకలను పునరుద్ధరించి కుక్కర్ల ఉన్న వాహనాలను సీజ్ చేశారు. కుక్కర్ల పంపిణీని అడ్డుకున్నారని కంది శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగగా, పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.