హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగడంతో నాణ్యమైన భోజ నం పెట్టలేకపోతున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి. కేవలం రూ.36తోనే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్తోపాటు రాత్రి డిన్నర్ అందించాల్సి ఉందని, పెరిగిన కూరగాయలు, నూనెల ధరలతోపాటు ఇతర వంట వస్తువుల ధరలకు ప్రస్తుతం చెల్లించే మెస్‌చార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి.
ప్రస్తుత మెస్‌చార్జీలు ఇలా..
గిరిజన గురుకులాల్లో 5,6,7 తరగతుల విద్యార్థులకు రూ.31.6 మెస్‌చార్జీ చెల్లిస్తుండగా.. 8, 9,10 తరగతుల వారికి రూ.36.6, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.50 చెల్లిస్తున్నారు. ఈ ధరలు ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఏ మాత్రం సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలంటే 25 శాతం మెస్‌చార్జీలు పెంచాల్సి ఉందని గురుకుల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ సురేందర్‌రాథోడ్ పేర్కొంటున్నారు.
25 శాతం పెంచితే ఇలా..
5 నుంచి 7 తరగతుల వారికి 25 శాతం మెస్‌చార్జీలు పెంచితే రూ.39.50, 8 నుంచి 10 తరగతుల వారికి రూ.45.15, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.62.50 చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.