హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చే విషయమై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. తీర్పు గురువారం వెలువడే అవకాశమున్నట్టు తెలిసింది. కవిత తరఫు న్యాయవాది నితీశ్ రాణే వాదనలు వినిపిస్తూ ఎటువంటి కారణాలు చూపించకుండానే సీబీఐ కవితను అరెస్టు చేసిందని అన్నారు.
కవిత సాక్ష్యాలను ధ్వంసం చేసిందనడం సరికాదని, తాను వాడిన ఫోన్లను తన అవసరం తీరిన తర్వాత సహాయకులకు ఇచ్చారని తెలిపారు. ఈడీ అధికారులు ఆ ఫోన్లును ఇవ్వాలని కోరిన వెంటనే ఆమె సహాయకులు ఫార్మాట్ చేసి ఇచ్చారని, కవిత వాటినే ఈడీ అధికారులకు కూడా అందజేశారని చెప్పారు. ఇందులో సాక్ష్యాలను ధ్వంసం చేయడమన్నదే లేదని స్పష్టం చేశారు.