హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పక్షాన ఆయన కార్యాలయం సీఎంవో శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ, ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించారని సీఎం కొనియాడారు.
నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు స్టాలిన్, మమత, అఖిలేశ్, పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలుప్రసాద్, సొరేన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్‌తోపాటు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఈ ప్రకటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోతే ఆనందం వ్యక్తం చేయడమేంటి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తేరుకున్న సీఎంవో తొలుత జారీ చేసిన ప్రకటనను గ్రూప్‌లో నుంచి తొలగించింది. తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు స్థానంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సందర్భంగా అంటూ మరో ప్రకటన జారీచేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో వీగిపోయిన ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తులు ఏకమైతే ఎలాంటి దురుద్దేశపు చట్టాలనైనా అడ్డుకోవచ్చని ఈ పరిణామం స్పష్టం చేసిందని తెలిపారు.