హైదరాబాద్, ఏప్రిల్9 (నమస్తే తెలంగాణ): వనస్థలిపురం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి ప్రభుత్వమే కారణమని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడమే మరణాలకు కారణమని మండిపడ్డారు. పలు బీసీ సంఘాలు గురువారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. రేవంత్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అమలును నిలిపేసిందని మండిపడ్డాయి.
ఫలితంగా ఫీజుల కోసం నల్లగొండ జిల్లాకు చెందిన బడుగు విద్యార్థులైన కంచర్ల శివ, నకరికంటి సందీప్ ఆన్లైన్ డెలివరీ బాయ్‌లుగా పార్ట్ టైం పనిచేయాల్సి వచ్చిందని వాపోయాయి. దీంతో విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశాయి. ఇది ఒక రకంగా రోడ్డు ప్రమాదం కాదని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో తాటికొండ విక్రమ్ గౌడ్, కులచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గూడూరు భాసర్,జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ ఉన్నారు.