హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): తీహార్ జైలులో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కవితను వెంటనే దీన్‌దయాళ్ దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రానికి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టులో హాజరు పరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకెళ్లారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు కోర్టు పొడిగించింది.