హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మొదటి విడత పంచాయతీ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో షాక్కు గురైంది. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను నయానో, భయానో తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నది. వక్రమార్గంలో పై‘చెయ్యి’ సాధించేందుకు కుట్రలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను దొడ్దిదారిన చేర్చుకొనేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నది.
పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పల్లెపోరులో విజయపతాక ఎగురవేసింది. అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలకు ఎదురొడ్డి గెలిచి పట్టు నిరూపించుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత ఏకగ్రీవాలుపోనూ 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 1702, బీఆర్ఎస్ 1345 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే అధికారం లేకున్నా అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో హోరాహోరీగా పోరాడి గులాబీ పార్టీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో విజయం సాధించారు. స్వయంగా సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలు పు బావుటా ఎగురవేశారు. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రచారం చేసిన జిల్లాల్లోనూ ఓటమి చవిచూడటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక భంగపడ్డ అధికార పార్టీ ‘చే’జారిన పల్లెలను అక్రమమార్గంలో తమ ఖాతాలో వేసుకొనేందుకు పన్నాగాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వారిని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు అడ్దదారిలో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులను రప్పించేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ముఖ్యనేత స్వయంగా ఈ తతంగాన్ని భుజాన వేసుకున్నట్టు సమాచారం. ఆయనే స్వయంగా బీఆర్ఎస్ మద్దతుదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. మధ్యవర్తులను పంపించి తమ పార్టీలోకి చేరాలని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలుస్తున్నది. తమ పార్టీలోకి వస్తేనే అభివృద్ధి పనులకు నిధులిస్తామని, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బు ఇస్తామని ఆశ చూపుతున్నట్టు సమాచారం.
అధికార పార్టీ ప్రలోభాలకు గులాబీ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఎరకు చిక్కడం లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత ఒత్తిడి తెచ్చినా పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. తమకు అండగా నిలిచిన గులాబీ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని పేర్కొంటున్నారు. నిధులు ఇవ్వకుంటే పోరాడి తెచ్చుకుంటామని తెగేసి చెబుతున్నారు. అంతేగానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని స్పష్టం చేస్తున్నారు. మరో మూడేండ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలు పరిష్కరించి.